గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కుర్రా, దాసోజు పేర్లు సిఫారసు: కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన కేటీఆర్
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కింద ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఇద్దరికి అవకాశం కల్పించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు ఇవాళ కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కింద ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఇద్దరికి అవకాశం కల్పించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కేటీఆర్ సోమవారంనాడు రాత్రి మీడియాకు వివరించారు. ఎస్టీ సామాజిక వర్గం నుండి కుర్రా సత్యనారాయణకు, బీసీ సామాజిక వర్గం నుండి దాసోజు శ్రవణ్ కుమార్ పేర్లను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవులకు కేబినెట్ సమావేశం తీర్మానం చేసిందని మంత్రి కేటీఆర్ చెప్పారు.
గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను ఆగస్టు మాసంలో నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి తీర్మానం చేసి పంపాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామన్నారు. రెండోసారి అసెంబ్లీ తీర్మానం చేసి పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించక తప్పదన్నారు కేటీఆర్. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిన బిల్లులను గవర్నర్ తిప్పి పంపడంపై ఆయన విమర్శలు చేశారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, కేసీఆర్ మధ్య గ్యాప్ కొనసాగుతుంది. ఈ విషయమై గవర్నర్ పై మంత్రులు, వైఎస్ఆర్ సీపీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేశారు. గవర్నర్ తీరుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పిటిషన్లు కూడ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్ర బడ్జెట్ ను ఆమోదించడం లేదని తెలంగాణ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.ఈ విషయమై రెండు వర్గాలకు చెందిన లాయర్లు రాజీ కుదిరిందని కోర్టుకు తెలిపారు. ఇక మరో వైపు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లుల విషయమై గవర్నర్ తీరుపై సుప్రీంకోర్టును కూడ తెలంగాణ సర్కార్ ఆశ్రయించింది.