గవర్నర్ ప్రసంగం లేకుండానే తెలంగాణ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలన్న కేసీఆర్ సర్కార్ నిర్ణయాన్ని ఆదిలాబాద్ బిజెపి ఎంపీ సోయం బాపూరావు తప్పుబట్టారు. ఇది సీఎం కేసీఆర్ నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. 

ఆదిలాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాల (telangana budget session) నిర్వహణకు సిద్దమైన కేసీఆర్ (KCR) సర్కార్ సాంప్రదాయానికి విరుద్దంగా నిర్ణయం తీసుకుంది. కేంద్రంలో అయితే రాష్ట్రపతి, రాష్ట్రాల్లో అయితే ఆయా రాష్ట్రాల గవర్నర్ల ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సాంప్రదాయాన్ని పక్కనబెట్టి ఈసారి గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమయ్యింది. ఈ నిర్ణయంతో సీఎం కేసీఆర్ పై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. 

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలన్ని కేసీఆర్ సర్కార్ నిర్ణయంపై ఆదిలాబాద్ బిజెపి ఎంపీ సోయం బాపూరావు (soyam bapurao) సీరియస్ అయ్యారు. రాజ్యాంగాన్ని తిరిగి రాయాలన్న సీఎం కేసీఆర్ ఆల్రెడీ రాష్ట్రంలో కల్వకుంట రాజ్యాంగం అమలు చేయడం ప్రారంభించారని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల బడ్జెట్ సమావేశాలు ఉభయ సభలు ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన తర్వాతనే ప్రారంభం కావాల్సి వుంటుందని ఎంపీ గుర్తుచేసారు. 

''గవర్నర్ నుంచి వచ్చిన ఉత్తర్వుల ఆధారంగానే ఏ రాష్ట్రంలో అయినా అసెంబ్లీ సెషన్ కొనసాగాలి. అలాంటిది ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ వ్యవస్థనే కించపరుస్తూ గవర్నర్ ప్రసంగం లేకుండానే ఈ నెల 7వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభిస్తున్నారు. ఇది ఆయన నిరంకుశ, నియంత స్వభావానికి అద్దం పడుతుంది'' అని ఎంపీ మండిపడ్డారు. 

''తెలంగాణ గవర్నర్ డా.తమిళిసై ఒక మహిళ అయినందువల్లనే ఆమె అసెంబ్లీలో ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించకుండా చేశారని స్పష్టంగా అర్థం అవుతోంది. మహిళలంటే కేసీఆర్ కు ముందు నుంచి చిన్న చూపు. అవకాశం ఉన్నప్పుడల్లా మహిళలను కేసీఆర్ అవమాన పరుస్తూనే ఉన్నారు. మొదటిసారి రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ ఏర్పడ్డాక ఆ క్యాబినెట్ లో మహిళలకు అవకాశమే ఇవ్వలేదు'' అని బాపూరావు గుర్తుచేసారు.

''ఇక ప్రస్తుతం రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఒక మహిళ అయినందువల్లనే ప్రతిసారీ సీఎం కేసీఆర్ ఆమెను అవమానపరుస్తున్నారు. మొన్నటికి మొన్న సమ్మక్క-సారలమ్మ జాతరకు గవర్నర్ వెళ్లినప్పుడు ఎక్కడా ప్రోటోకాల్ పాటించనే లేదు. రాష్ట్ర ప్రథమ మహిళ ఒక దేవస్థానికి వెళ్లినప్పుడు అప్పటివరకు అక్కడే ఉన్న మంత్రులు సడెన్ గా మాయం అయ్యారు. మంత్రులెవరూ గవర్నర్ ని ఆహ్వానించలేదు. ఇప్పడు బడ్జెట్ సమావేశాల సందర్భంగా మరోసారి మహిళా గవర్నర్ ను అవమానించేలా నిర్ణయం తీసుకున్నారు'' అని బిజెపి ఎంపీ మండిపడ్డారు. 

''సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సొంత రాజ్యం అనుకుంటున్నారు. తనకు ఏది ఇష్టమైతే అదే చేస్తున్నారు. ఆయన చేసే పనులు రాజ్యాంగ విరుద్ధంగా వుంటున్నాయి. ఇలా అహంకారంతో పాలిస్తున్న ఆయనకు కాలం దగ్గరపడింది. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లు కూలిపోయే ప్రభుత్వం అని తెలిసి కూడా కేసీఆర్ ఎగిసి పడుతున్నారు'' అని బిజెపి ఎంపీ బాపూరావు మండిపడ్డారు.

ఇదిలావుంటే నిన్న(సోమవారమే) తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల తేదీలను ఖరారుచేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. మార్చి 7వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 7వ తేదీ ఉదయం 11.30 అసెంబ్లీ ప్రారంభం కానుంది.

రాష్ట్ర బడ్జెట్ కు ఆమోదం తెలిపేందుకు మార్చి 6వ తేదీ (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. మార్చి 7వ తేదీన ప్రారంభంకానున్న బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే నేరుగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.