పొత్తు ధర్మాన్ని విస్మరించి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవికి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మద్దతు ప్రకటించడంపై బిజెపి తెలంగాణ నాయకత్వం సీరియస్ అవుతోంది.
హైదరాబాద్: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మీద తెలంగాణ బిజెపి నాయకత్వం సీరియస్ అయింది. పొత్తు ధర్మాన్ని విస్మరించి, పవన్ కల్యాణ్ ప్రకటన చేశారని మండిపడుతోంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పొత్తు ధర్మాన్ని విస్మరించి, తీరా ఓటింగు రోజున పవన్ కల్యాణ్ టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవికి మద్దతు ప్రకటించడం తీవ్రమైన విషయమని బిజెపి తెలంగాణ నేతలు అంటున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జిహెచ్ఎంసీ) ఎన్నికల్లో మద్దతు తెలిపినందుకు తాము పవన్ కల్యాణ్ కు ధన్యవాదాలు తెలిపిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణిదేవి చేతిలో బిజెపి అభ్యర్థి రామచందర్ రావు ఓటమి పాలయ్యారు. దీంతో బిజెపి సిట్టింగ్ సీటును కోల్పోయింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో బిజెపి తెలంగాణ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. నిజానికి, పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనతో తమ రాష్ట్రంలో పొత్తుకు బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మొదటి నుంచి కూడా సుముఖంగా లేనట్లే కనిపించారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉండదని ఆయన ప్రకటించారు. ఆ విషయాన్ని ఆయన ఒకటికి రెండు సార్లు ప్రకటించారు. అయితే, పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తికి గురి కావడంతో బిజెపి అధిష్టానం రంగంలోకి దిగింది.
పవన్ కల్యాణ్ ను సంతృప్తిపరచడానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డిని పవన్ కల్యాణ్ వద్దకు పంపించింది. దాంతో పవన్ కల్యాణ్ సంతృప్తి చెంది బిజెపికి మద్దతు ప్రకటించారు. అయితే, అందుకు గాను ఆయన తిరుపతి లోకసభ సీటును ఆశించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, తిరుపతి లోకసభ ఉప ఎన్నికలో బిజెపి పోటీ చేయడానికి నిర్ణయించుకుంది. ఆ విషయాన్ని పవన్ కల్యాణ్ కు స్పష్టం చేసింది.
మొదటి నుంచీ తిరపతి సీటు కోసం పట్టుబడుతూ వచ్చిన పవన్ కల్యాణ్ బిజెపి తీరుతో తీవ్ర అసంతృప్తికి గురి కావడమే కాకుండా ఒత్తిడికి గురైనట్లు కనిపించారు. ఆ ఒత్తిడిలోనే పవన్ కల్యాణ్ సురభి వాణిదేవికి మద్దతు ప్రకటించారని భావిస్తున్నారు. అంతేకాకుండా, బిజెపితో తెగదెంపులు చేసుకునే దిశగా పవన్ కల్యాణ్ అడుగులు వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
