బిజెపిలో మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఉన్న రవళి కుంచన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 

వరంగల్ బిజెపిలో వర్గ పోరు కారణంగా బిజెపి కి రవళి గుడ్ బై చెప్పారు. పార్టీలో ఆమెను గత ఏడాది కాలంగా దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ అర్బన్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నరని.. అందుకే తాను పార్టీ మారినట్లు రవళి ఇప్పటికే వివరణ ఇచ్చారు.

మరోవైపు బిజెపి పార్టీ టిఆర్ఎస్ పై పోరాటం చేయకుండా ఉత్త మాటలతోనే టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అవుతామని ప్రకటించడం బాధ కలిగిస్తోందని ఆమె తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. బిజెపిలో నాగం జనార్దన్ రెడ్డి లాంటి వాళ్లు కూడా ఇబ్బందుల్లో నెట్టుకొస్తున్నారని ఆమె బాంబు పేల్చారు.

రవళి కుంచన పార్టీ మారే ఉద్దేశంతోనే బిజెపిపై విమర్శలు చేసి వెళ్లారని... ఆమె పార్టీ మారినంత మాత్రాన బిజెపి కి వచ్చిన నష్టమేమీ లేదని వరంగల్ జిల్లాకు చెందిన బిజెపి నాయకుడు పృథ్విరాజ్ గౌడ్ ఏషియానెట్ కు తెలిపారు. మధ్యలో వచ్చిన వాళ్లు మధ్యలోనే వెళ్లిపోతారని, పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసేవారే కడవరకు ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. రవళి కుంచన ను పార్టీలో చేర్పించిందే రావు పద్మ అనే విషయాన్ని మరచిపోయి నేడు ఆమెపైనే విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు.

రవళి కుంచన కాంగ్రెస్ లో చేరనుండడంతో బిజెపిలో నెలకొన్న వివాదానికి పులిస్టాప్ పడే చాన్స్ ఉందంటున్నాయి బిజెపి వరంగల్ వర్గాలు. 

రవళి ఉత్తమ్, సర్వే సత్యనారాయణ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆమె జాయినింగ్ వీడియో స్టోరీ కింద చూడొచ్చు.