తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇచ్చారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. బీజేపీని తిట్టేందుకే టీఆర్ఎస్ ప్లీనరీని ఏర్పాటు చేశారన్నారు.

నారాయణపేట జిల్లాలో BJP తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గురువారం నాడు మీడియాతో మాట్లాడారు. ప్రజా సంగ్రామ యాత్రను చూసి టీఆర్ఎస్ నేతలకు భయం పట్టుకొందన్నారు. Praja Sangrama Yatraలో ప్రజలు స్వచ్ఛంధంగా వచ్చారన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టేందుకే టీఆర్ఎస్ ప్లీనరీని ఏర్పాటు చేశారన్నారు. పార్టీని సంస్థాగతంగా ఎలా బలోపేతం చేసుకోవాలి, రానున్న రోజుల్లో ఎలా ఉండాలనే దానిపై ప్లీనరీలో చర్చిస్తారన్నారు. కానీ దానికి భిన్నంగా టీఆర్ఎస్ ప్లీనరీ జరిగిందన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రజలకు ఏం చేశామో చెప్పుకోవడానికి ఏమీ లేక టీఆర్ఎస్ నేతలు కేంద్రంపై విమర్శలు చేశారని బండి సంజయ్ చెప్పారు. 2014లో మోడీ ప్రధానిగా అధికారాన్ని చేపట్టే నాటికి దేశ ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉండేదని బండి సంజయ్ చెప్పారు.ఈ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అనేక ప్రయత్నాలను కేంద్రం చేపట్టిందని బండి సంజయ్ గుర్తు చేశారు. విదేశాలకు చెందిన అధ్యక్షులు, ప్రధానులు మోడీని ప్రశంసలతో ముంచెత్తారని బండి సంజయ్ గుర్తు చేశారు. ఏ స్థాయి నుండి భారత ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేశారో వారు వివరించారని సంజయ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ధనిక రాష్ట్రంగా ఉన్న Telangana ఎందుకు అప్పులు చేయాల్సి వచ్చిందో చెప్పాలని బండి సంజయ్ కేసీఆర్ ను ప్రశ్నించారు. రూ. 4 లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. తెలంగాణలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రతి నెల 12 తేదీ వరకు జీతాలు వచ్చే పరిస్థితి లేదని చెప్పారు. రోజుకో జిల్లాకు జీతాలు ఇచ్చే పరిస్థితికి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని దిగజార్జాడని ఆయన కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. ధనిక రాష్ట్రమైతే ఉద్యోగులకు ఎందుకు జీతాలు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.

రూ. 70 వేల కోట్లు డిస్కంలకు ప్రభుత్వం అప్పు ఉందన్నారు. విద్యుత్ చార్జీలను పెంచారన్నారు. మే మాసం విద్యుత్ బిల్లులు వస్తే వినియోగదారులకు గుండెపోటు వస్తుందని బండి సంజయ్ చెప్పారు.

రూ. 30 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును రూ. 1 లక్ష కోట్లకు అంచనాలు పెంచి దోచుకోలేదా అని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు బండి సంజయ్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంచనాలను రూ. 70 వేలకు పెంచి కేసీఆర్ దోచుకొన్నాడని బండి సంజయ్ విమర్శించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పులపాలైందన్నారు. కానీ కేసీఆర్, ఆయన కుటుంబం మాత్రం ఆస్తులు పెంచుకొన్నారని బండి సంజయ్ ఆరోపించారు.

బీఆర్ఎస్ ఏర్పాటు విషయమై బండి సంజయ్ సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ తర్వాత ఏఆర్ ఎస్ ఏర్పాటు చేస్తారేమో అన్నారు. ఇండియా తర్వాత అంతర్జాతీయ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేస్తారా అని బండి సంజయ్ ప్రశ్నించారు.టీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చారన్నారు. రాష్ట్రాన్ని కొడుకుకు, దేశాన్ని బిడ్డకు, ప్రపంచాన్ని అల్లుడికే ఎవరికి ఇస్తారని బండి సంజయ్ సెటైర్లు వేశారు. కేసీఆర్ అత్యంత అవినీతి పరుడని బండి సంజయ్ చెప్పారు సహారా , ఈఎస్ఐ స్కామ్ ల్లో కేసీఆర్ పై ఆరోపణలు వచ్చాయన్నారు ఈ విషయమై సీబీఐ విచారణ జరపలేదా అని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్న వారిలో ఒకరిద్దరూ మినహా అవినీతి ఆరోపణలున్నాయన్నారు.