ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కరీంనగర్ ఎంపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. కేసీఆర్ క్వారంటైన్‌లో ఉన్నారని.. పేదలు ఇబ్బందులు పడుతుంటే ఇంట్లో నుంచి బయటకురారని ఆయన విమర్శించారు.

జోకర్ ముఖ్యమంత్రి , క్వారంటైన్ ముఖ్యమంత్రి అన్న పేరు కేసీఆర్‌కి కరెక్ట్‌గా సెట్ అవుతుందని సంజయ్ విమర్శలు చేశారు. ప్రజలను-రైతులను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆయన ఆరోపించారు.

కోటి టన్నుల ధాన్యం సేకరిస్తా అన్నా సీఎం ఇప్పటి వరకు 20 టన్నుల ధాన్యం మాత్రమే సేకరించిందని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు అగ్రికల్చర్ బులిటెన్ విడుదల చేస్తున్నాయని.. మరి తెలంగాణ సర్కార్ ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.

Also Read:వలస కార్మికులకు కరోనా... రాష్ట్రాలకు తలనొప్పి

దేశంలో 18 రాష్ట్రాల ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేస్తున్నాయని.. సీఎం మీడియా సమావేశంపై ప్రజలు నవ్వుకుంటున్నారని సంజయ్ దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సూచనలు చేస్తుంటే సీఎం స్వీకరించడం లేదని, రాబోయే రోజుల్లో రైతులు ఇబ్బందులు పడే పరిస్ధితి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు.

ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వానికి విధివిధానాలు లేవని.. పంట కొనుగోళ్ల కోసం బోర్డులను ఏర్పాటు చేసి వెళ్లాలి కాని వెళ్లడం లేదన్నారు. కమీషన్ కోసం ప్రభుత్వం కక్కుర్తి పడుతోందని... రాష్ట్రంలో దళారుల రాజ్యం నడుస్తోందని సంజయ్ ఆరోపించారు.

సీఎం కేసీఆర్‌కి దమ్ము, ధైర్యం ఉంటే కొనుగోళ్ల కేంద్రాల్లో పర్యటించాలని ఆయన సవాల్ విసిరారు. కేసీఆర్ కేబినెట్ లో ఒక్కో మంత్రి ఒక్కో మాట మాట్లాడుతారని... 464 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం గిడ్డంగుల నిర్మాణానికి ఇచ్చిందని, 22 లక్షల టన్నుల ధాన్యం వాటి వల్ల స్టోరేజ్ చేయొచ్చని సంజయ్ అభిప్రాయపడ్డారు.

రైతుల పంటను నిల్వ చేసేందుకు ఎన్ని ఫంక్షన్ హాల్స్ బుక్ చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మద్దతు ధర లేకున్నా పంట అమ్ముడు పోతే చాలు అన్నట్లు రైతులు తయారు అయ్యారని అన్నారు. ప్రజల మరణాలను కోరుకుంటోంది కేసీఆరేనని, కేసీఆర్ నిర్ణయాల వల్ల హైదరాబాద్‌లో కేసులు పెరిగాయని సంజయ్ మండిపడ్డారు.

టెస్టులు జరగాలని కేంద్రం అంటుంటే కేసీఆర్ మాత్రం తన పేరు కోసం టెస్టులను తగ్గించారని, వైద్యులు టెస్టులు జరపాలని కోరుతున్నా... ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని సంజయ్ ధ్వజమెత్తారు.

గత నెల 24 నుంచి 28వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నివేదికలో 26 ఉంటే... రాష్ట్ర నివేదికలో 25 మాత్రమే ఉన్నాయని సంజయ్ అన్నారు. ఏప్రిల్ 26వ తేదీన కొరొనా రోగి మరణిస్తే జీహెచ్ఎంసీ ఆయన అంత్యక్రియలు నిర్వహించిందని సంజయ్ తెలిపారు.

Also Read:కేసీఆర్ సర్కార్ నిర్ణయం.. మాస్క్ లేకుండా బయట అడుగుపెట్టారో...

లక్షా 62 వేల ఎన్-95 మాస్కులు, 66 వేల పీపీఈ కిట్లను కేంద్రం ఇచ్చిందని.. కేంద్ర ప్రభుత్వం టెస్టుల కోసం లాబ్‌లలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఉపయోగిస్తుందో చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు.

విమర్శలకు ప్రతివిమర్శలు సమాధానం కాదని ఆయన హితవు పలికారు. పాతబస్తీలో దళిత యువతిపై అత్యాచారం చేయడం దురదృష్టకరమని... ప్రభుత్వం ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని సంజయ్ ఆరోపించారు.

దొంగలకు అడ్డాగా మారుస్తున్న ఎంఐఎంకి టీఆర్ఎస్ పార్టీ మద్ధతు ప్రకటించడం బాధాకరమని... దళిత మహిళపై అసభ్యకరంగా వ్యవహరించినందుకు కేసులు పెట్టాలి హనుమాన్ భక్తులు మాల వేసుకుంటే కేసులు పెట్టారని సంజయ్ చెప్పారు.