తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఆ మధ్య కాస్త కేసులు తగ్గినట్లు అనిపించినా... మళ్లీ పెరగడం మొదలయ్యాయి. ఈ కేసుల నేపథ్యంలోనే రాష్ట్రంలో లాక్ డౌన్ ఈ నెల 29 వరకు పొడిగించారు. అయితే... కొన్ని చోట్ల మాత్రం లాక్ డౌన్ సడలించారు.

లాక్ డౌన్ సడలించడంతో జనాలు స్వేచ్ఛ వచ్చిన మాదిరి రోడ్డపై తిరగడం మొదలుపెట్టారు. ఇలానే కొనసాగితే... మళ్లీ కేసులు పెరిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ ప్రభుత్వం పలు హెచ్చరికలు జారీ చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించకపోతే రూ.1000 ఫైన్ విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది.  లాక్‌డౌన్‌ పొడిగింపు, అమలుకు సంబంధించి గురువారం జారీ చేసిన జీవోలో మాస్కు నిబంధనను ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. 

ప్రజలు మాస్కు కచ్చితంగా ధరించాలని, లేనిపక్షంలో ఫైన్ విధించే అధికారం పోలీసులకు, అధికారులకు కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది. దాని అమలుపై దిశానిర్దేశం చేస్తూ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ జీవో జారీ చేశారు.
ఇదిలా ఉండగా 

తెలంగాణలో గురువారం కూడా తక్కువ సంఖ్యలోనే కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవాళ రాష్ట్రంలో 15 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 1,122కి చేరుకుంది. గురువారం కరోనా నుంచి 45 మంది బాధితులు డిశ్చార్జ్ కావడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 693కి చేరింది.

మరో 400 మంది బాధితులు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా బారినపడి ఇప్పటి వరకు 29 మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే ముగ్గురు వలస కూలీలకు కోవిడ్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.  కాగా.. దేశంలో కరోనా కేసులు 56వేలకు చేరాయి.