BJP MLA T. Raja Singh: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలేనని భారతీయ జనతా పార్టీ నాయకుడు ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. ప్రజలను ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
Telangana: తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ల మధ్య మాటల యుద్ధం మరింతగా ముదురుతోంది. ఇరు పార్టీల నేతలు విమర్శలు, ఆరోపణలతో రాజకీయ కాకరేపుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలేనని భారతీయ జనతా పార్టీ నాయకుడు ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. ప్రజలను ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి లక్షల కోట్ల నిధులు వచ్చినా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని సీఎం కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. మెదక్ జిల్లాలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
అలాగే, కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తానని చెప్పి దేశమంతా తిరుగుతున్న కేసీఆర్‌ను రాష్ట్ర ప్రజలు తరిమికొడతారన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలన్నింటిపై అధికార టీఆర్‌ఎస్ నేతలు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. జిల్లాలోని అన్ని ఇళ్లకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని రాజాసింగ్ పార్టీ నాయకులు, కార్యకర్తలను కోరారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను రాష్ట్రంలో నుంచి తరిమికొడతారంటూ వ్యాఖ్యానించారు. అలాగే, అధికార టీఆర్‌ఎస్ పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ అవగాహనారాహిత్యం వల్లే రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిందని బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ఆరోపించారు. రాష్ట్రంలోని సొంత ప్రభుత్వంపై అధికార టీఆర్‌ఎస్ నేతలు ధర్నాలు చేస్తున్నారని అన్నారు. అధికార టీఆర్‌ఎస్‌ను ఓడించే వరకు రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడతామని స్పష్టం చేశారు. తెలంగాణలో సామాజిక న్యాయం బీజేపీ పాలనలోనే సాధ్యమైందన్నారు.
ఇదిలావుండగా, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సైతం తాజాగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బద్నాం చేస్తున్నారని ఆరోపించారు. బొగ్గు దిగుమతి అంశంలో కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ అధికారులతో అవాస్తవాలు చెప్పిస్తున్నారని ఆరోపించారు. సోమవారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ అనేది చాలా పెద్ద కుంభకోణం అని ఆరోపించారు. బినామీ వ్యక్తులతో భద్రాద్రి పవర్ ప్లాంట్‌ను నడిపిస్తున్నారని విమర్శించారు. బినామీ వ్యక్తులతో పెట్టుబడులు పెట్టించి.. కమిషన్లు దోచుకుంటున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టర్లతో కుమ్మకై రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెడుతున్నారని విమర్శించారు.
పాతబస్తీలో విద్యుత్ చార్జీలు వసూలు చేయడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ప్రత్యేకంగా సబ్ స్టేషన్ పెట్టుకున్నారని విమర్శించారు. ఫామ్ హౌస్‌లో వందల ఎకరాలకు ఉచిత కరెంట్ వాడుకుంటున్నారని ఆరోపించారు. మీటర్లు పెడితే బడా బాబుల ఫామ్‌హౌస్‌లో విద్యుత్ అక్రమాలు వెలుగుచూస్తాయని అన్నారు. మీటర్లపై టీఆర్‌ఎస్ నేతలు కావాలనే రైతులు తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. డిస్కంలను ప్రభుత్వం నష్టాల్లో ముంచిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నిధులను టీఆర్ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని ఆరోపించారు. రూ. 3 కొనే కరెంట్‌ను తెలంగాణ ప్రభుత్వం రూ. 6కు కొనుగోలు చేస్తుందని విమర్శించారు.
