గిరిజనుల భూములను కేసీఆర్ సర్కార్ దోచుకుంటోందన్నారు తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి. ఆదివారం నల్గొండ జిల్లా గుర్రంపోడులో గిరిజనుల భూములను బండి సంజయ్‌తో కలిసి ఆమె పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రెండోసారి కేసీఆర్‌కు అధికారం ఇచ్చి తప్పుచేశారని వ్యాఖ్యానించారు. దోపిడీ జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని విజయశాంతి ప్రశ్నించారు. అమాయకులుగా ఉండొద్దని.. టీఆర్ఎస్ నేతలపై తిరగబడాలని రాములమ్మ గిరిజనులకు పిలుపునిచ్చారు. 

అంతకుముందు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. గిరిజనులు ఆనాదిగా వన్యమృగాలతో పోరాడారని అయితే ఇప్పుడు కూడా గుంట నక్కలు, గద్దలు వచ్చాయని కాకపోతే మనుషుల రూపంలో అంటూ సెటైర్లు వేశారు.

ఇన్ని రోజులు గిరిజనులకు ఎవరూ లేరని కానీ భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని సంజయ్ స్పష్టం చేశారు. గిరిజనుల మీద దాడులు చేసినా, బెదిరించినా వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు.

గిరిజనుల మీద దాడులు చేయడంతో పాటు హత్యాయత్నం కేసులు పెట్టిన వారిపై కేసీఆర్ చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇందుకు బాధ్యులైన ఎంపీలు, ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు.

నాగార్జున సాగర్‌లో కూడా పోడు భూముల సమస్య వుందని.. గిరిజనుల కోసం ఏ పార్టీ ఆలోచించడం లేదని కేవలం బీజేపీ ఒక్కటే వారి పక్షాన పోరాడుతుందన్నారు. గిరిజనుల భూముల్ని పరిశీలించడానికి వస్తే బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జీ చేయడంతో పాటు రాళ్లతో కొట్టారని సంజయ్ మండిపడ్డారు.

పోడు భూములు, గిరిజనులు, ఆదివాసీలు, దళితులకు టీఆర్ఎస్ గతంలో మూడెకరాల స్థలం ఇస్తామని చెప్పిందని.. కానీ ఈరోజున భూమి లాక్కొంటోందని ఆయన ఆరోపించారు. అవసరమైతే భూముల్ని లాక్కుని గిరిజనులకు పంచుతామని సంజయ్ స్పష్టం చేశారు.