బీజేపీ కార్యకర్తలకు ఉద్యమాలు, అరెస్ట్‌లు కొత్త కాదన్నారు ఆ పార్టీ తెలంగాణ నేత విజయశాంతి. దాడులకు పాల్పడ్డ టీఆర్ఎస్ కార్యకర్తలను విడిచిపెట్టారని ఆమె ఆరోపించారు. కానీ 44 మంది బీజేపీ కార్యకర్తలు, నేతలను అరెస్ట్ చేసి వేధించారని రాములమ్మ మండిపడ్డారు.

తాము తెగిస్తే జైళ్లు చాలవని... టీఆర్ఎస్ తీరు మారకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని విజయశాంతి హెచ్చరించారు. వరంగల్ వెళ్లి ప్రత్యక్ష నిరసన పోరాటాల్లో పాల్గొనేందుకు సిద్ధంగా వున్నమని రాములమ్మ తెలిపారు. 

Also Read:మాకు ఓపిక నశిస్తే.. మీరు బయట తిరగలేరు: బీజేపీకి మంత్రి కేటీఆర్ వార్నింగ

కాగా, టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై రాళ్లదాడి ఘటనలో పోలీసులు 57 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో 44 మందికి వరంగల్ ఆరో అదనపు మునిసిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు ఈ నెల 15వ తేదీ వరకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.

అయోధ్య రామమందిరం విషయంలో ఎమ్మెల్యే ధర్మారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ కార్యకర్తలు ఆదివారం హన్మకొండలోని ఆయన ఇంటిపై దాడిచేశారు. అడ్డుకున్న పోలీసులతో వారు దురుసుగా ప్రవర్తించారు.