ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ కార్యకర్తల దాడిని ఖండించారు టీఆర్ఎస్ నేతలు. దాడి తర్వాత ఇంటికి చేరుకున్నారు ఎమ్మెల్యే ధర్మారెడ్డి, ఎర్రబెల్లి, టీఆర్ఎస్ నేతలు. అనంతరం ఆ పార్టీ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు.

వరంగల్ కార్పోరేషన్ ఎన్నికలకు ముందు బీజేపీ నేతలు కావాలనే రెచ్చగొడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఈ ఘటనను ఎట్టి పరిస్ధితుల్లోనూ వదిలిపెట్టమని ఎర్రబెల్లి హెచ్చరించారు. బీజేపీ నేతలు ఖబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు.

ధర్మారెడ్డి ఇంటిపై దాడి ఘటనలో 56 మంది బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు చల్లా ధర్మారెడ్డి ఇంటిపై జరిగిన దాడిని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి  కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు.

Also Read:అయోధ్య విరాళాలపై వ్యాఖ్యలు: చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ దాడి

ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతిక దాడులకు ఏ మాత్రం చోటు లేదని ఆయన పేర్కొన్నారు. తమ వాదనలతో ప్రజలను ఒప్పించడం చేతకాక ఇతరు పార్టీలపై భౌతికదాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ తీరును ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని కేటీఆర్‌ అన్నారు.

గతంలోనూ బీజేపీ భౌతిక దాడులకు యత్నించిందని గుర్తుచేశారు. రాజకీయాల్లో హేతుబద్ధమైన విమర్శలను దాటి బీజేపీ పదేపదే భౌతికదాడులకు దిగడం తెలంగాణ రాజకీయాలకు ఏ మాత్రం వాంఛనీయం కాదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. 

మా సహనానికీ ఓ హద్దు ఉంటుందని కేటీఆర్ చెప్పారు. బీజేపీ భౌతిక దాడుల్ని ఎదుర్కొనే శక్తి టీఆర్ఎస్‌కు ఉందని.. తమ కార్యకర్తల ఓపిక నశిస్తే, బీజేపీ శ్రేణులు బయటకు తిరగలేరని మంత్రి వార్నింగ్ ఇచ్చారు.