హైదరాబాద్: తెలంగాణ ప్రజలు కన్నుల పండువగా జరుపుకునే బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహించింది తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా. గోల్కోండ కోట వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ ఉత్సవాల్లో తెలంగాణ బీజేపీ మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ ముఖ్యఅతిథిగా బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. బతుకమ్మలను మధ్యలో ఉంచి చుట్టూరా చేరి పాటలు పాడుతూ చిందులేశారు. మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ, చిందులేశారు బీజేపీ చీఫ్ డా.లక్ష్మణ్.  

తెలంగాణ సాంప్రదాయ పండుగను గోల్కోండ కోటలో నిర్వహించడం సంతోషకరమన్నారు. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమంలో తాను పాల్గొనడం చాలా సంతోషకరమన్నారు.  ఏడాదికోసారి వచ్చే మన పండుగను ప్రతిఒక్కరూ ఆస్వాదిస్తూ, ఆనందంగా జరుపుకోవాలని డా. లక్ష్మణ్ రాష్ట్రప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.