బీజేపీ కార్యకర్తలు కేసులకు భయపడరని అన్నారు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. రాష్ట్రంలో సమస్యలపై ప్రశ్నిస్తే మంత్రులు, టీఆర్ఎస్ నేతలు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పారని ఇప్పటి వరకు అది ఎంతమందికి అందిందని బండి సంజయ్ ప్రశ్నించారు.  


ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ (trs) పాలనలో అరాచకాలు పెరిగిపోయాయన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ (bandi sanjay) ఆరోపించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఆదివారం నారాయణపేట జిల్లా ధన్వాడలో ఆయన పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బండి సంజయ్‌ మాట్లాడుతూ.... రాష్ట్రంలో సమస్యలపై ప్రశ్నిస్తే మంత్రులు, టీఆర్ఎస్ నేతలు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలు కేసులకు భయపడరని బండి సంజయ్ స్పష్టం చేశారు. 

టీఆర్ఎస్ అరాచకాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. కేసీఆర్‌ అమ్ముకోవడానికి భూములు ఉంటాయి కానీ, పథకాల పేరుతో పేదల భూములు గుంజుకుంటున్నారని సంజయ్ ఆరోపించారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దళిత బంధు ఈ ప్రాంతంలో ఎంతమందికి వచ్చిందో అర్ధం చేసుకోవాలని ప్రజలను కోరారు.

అంతకుముందు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కి మంత్రి ప్రశాంత్ రెడ్డి (prasanth reddy) సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కు ఇచ్చిన నిధులపై నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. బండి సంజయ్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడని.. అకౌంట్లలో 15 లక్షల రూపాయలు వేస్తా అని అన్నాడు వేశాడా అందుకే పాదయాత్ర చేస్తున్నావా? అని మంత్రి ప్రశ్నించారు. పెట్రోల్ ,డీజిల్ , గ్యాస్ ధర పెంచినందుకా పాదయాత్ర.. ? అని ప్రశ్నించారు. తెలంగాణకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్ కు తరలించినందుకా నీ పాదయాత్ర అని ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఒక బుడ్ధార్ ఖాన్… వరంగల్‌లో రాహుల్ గాంధీ రైతు సభలు పెడతారంట అంటూ మండిపడ్డారు. 70 ఏండ్లు పాలించిన మీరు రైతులకు ఎం చేశారని ఈ సభ పెడుతున్నారని నిలదీశారు ప్రశాంత్‌ రెడ్డి.

మంత్రి మల్లారెడ్డి (minister malla reddy) మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ దివాళా తీసిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు రాహుల్ గాంధీ (rahul gandhi) తెలంగాణకు వచ్చి ఏం చేస్తారని మల్లారెడ్డి ప్రశ్నించారు. 70 ఏళ్ల నుంచి కార్మికులకు స్వాతంత్య్రం లేదని.. పెట్రోల్, డీజిల్ , గ్యాస్ ధరలు పెంచుతున్నందుకు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారా అని దుయ్యబట్టారు. వరి వేస్తే కొనుగోలు చేయమని చెప్పినందుకు పాదయాత్ర అంటూ మల్లారెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ (bjp), కాంగ్రెస్‌లను (congress) ప్రజలు తరిమి కొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు.