సూర్యాపేట కబడ్డీ పోటీల సందర్భంగా గ్యాలరీ కూలిన ఘటనలో గాయపడ్డ వారిలో సైదులు అనే వ్యక్తి నిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి కుటుంబంతో పాటు నాటి ఘటనలో గాయపడ్డ వారిని కరీంనగర్ ఎంపీ, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పరామర్శించి, ఓదార్చారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఘటన జరిగి నాలుగు రోజులు అయ్యిందని, కానీ ఇంత వరకు ప్రభుత్వ పెద్దలు స్పందించకపోవడం సిగ్గు చేటన్నారు. ఈ కబడ్డీ పోటీలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిందా, మంత్రి కుటుంబం నిర్వహించిందా..? రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ నిర్వహించిందా అంటూ సంజయ్ మండిపడ్డారు.

ఘటన జరిగిన తరువాత భాదితులను పలకరించాలని  ప్రభుత్వానికి లేదంటూ ఆయన దుయ్యబట్టారు. సైదులు అనే పేద యువకుడు చికిత్స పొందుతూ మరణించాడని.. ఈ కబడ్డీ పోటీలకు అనుమతి ఇచ్చిన అధికారులు పై చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

చనిపోయిన వారికి, గాయపడ్డ బాధితులకు ప్రభుత్వం 10 లక్షలు నష్ట పరిహారం ఇవ్వాలని ఆయన కోరారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, అలాగే ఈ ఘటనపై న్యాయ విచారణ జరగాలని సంజయ్ డిమాండ్ చేశారు.