హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆమ్నేషియా పబ్ అత్యాచారం ఘటనలో పోలీసుల నిర్లక్ష్యంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. ఇప్పటికీ ఎఫ్ఐఆర్‌లో నిందితుల పేర్లు నమోదు చేయలేదని.. హోంమంత్రి మీదే ఆరోపణలు వస్తున్నాయని సంజయ్ అన్నారు

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆమ్నేషియా పబ్ (amnesia pub rape case) అత్యాచారం కేసులో ప్రభుత్వ నిర్లక్ష్యంపై తెలంగాణ బీజేపీ (bjp) చీఫ్ బండి సంజయ్ (bandi sanjay) మండిపడ్డారు. రేప్ కేసు విచారణలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సిగ్గు చేటని ఆయన ఎద్దేవా చేశారు. ఆ పబ్‌లో పార్టీ పెట్టింది ఎవరని బండి సంజయ్ ప్రశ్నించారు. హైదరాబాద్ క్రిమినల్స్‌కు అడ్డాగా మారిందని ఆయన ఫైరయ్యారు. బాధితురాలు తనపై ఎవరు అత్యాచారం చేశారో చెప్పిందని బండి సంజయ్ వెల్లడించారు. 

ఇప్పటికీ ఎఫ్ఐఆర్‌లో నిందితుల పేర్లు నమోదు చేయలేదని.. హోంమంత్రి మీదే ఆరోపణలు వస్తున్నాయని సంజయ్ అన్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లో వాస్తవాలు బయటపడ్డాయని.. సీఎం, డీజీపీ ఇప్పటిదాకా స్పందించలేదని ఆయన ఫైరయ్యారు. ఏ సంఘటన జరిగినా సీఎం స్పందించరని.. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. అత్యాచార ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. 

Also read:amnesia pub rape case: హోంమంత్రి మనవడికి సంబంధం లేదు.. సీసీటీవీ ఫుటేజ్‌తో క్లారిటీ : తేల్చేసిన పోలీసులు

ఇకపోతే.. అత్యాచార కేసుకు సంబంధించి బీజేపీ (bjp) ఎమ్మెల్యే రఘునందన్ రావు (Raghunandan Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రి మనవడు, పీఏ పాత్రపై నిజాలు నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. హోంమంత్రి మనవడే సూత్రధారంటూ రఘునందన్ రావు ఆరోపించారు. పబ్‌లో పార్టీ బుక్ చేసిందే హోంమంత్రి (home minister mahmood ali ) మనవడని ఆయన పేర్కొన్నారు. ఎంఐఎం పార్టీ (mim) ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్‌గా పనిచేస్తున్న వ్యక్తి కుమారుడు, పాతబస్తీకి చెందిన ఓ ప్రముఖ దినపత్రిక డైరెక్టర్ కొడుకు , హోంమంత్రి మనవడు , హోంమంత్రి పీఏ హరిలు సీసీటీవీ ఫుటేజ్‌లో ప్రత్యక్షంగా కనిపిస్తున్నారని రఘునందన్ రావు చెబుతున్నారు. 

ఇప్పటి వరకు రేప్ కోసం వాడిన కారును ఎందుకు సీజ్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఇదంతా హిందూ అమ్మాయిలపై రజాకార్ల వారసత్వ మనస్తత్వం కలిగిన ఎంఐఎం పార్టీ పెద్దలు కొందరు, టీఆర్ఎస్ పార్టీ మంత్రులకు సంబంధించిన కుటుంబ సభ్యులు కొందరు కలిసి జరుపుతున్న దాడిగా బీజేపీ ఆరోపిస్తోందని రఘునందన్ రావు అన్నారు. నిజంగా ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి వుంటే .. హోంమంత్రిని ఆ పదవి నుంచి తొలగించి నిష్పక్షపాతంగా విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. హోంమంత్రి పదవిలో మహమూద్ అలీ వుంటే దర్యాప్తు పారదర్శకంగా జరగదని రఘునందన్ రావు ఆరోపించారు.