కాళీమాత భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. హైదరాబాద్ పాతబస్తీలో కాళీమాత దేవాలయ భూములపై వివాదం నేపథ్యంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.

కాళీమాత భూములు కబ్జా కాకుండా చూడాల్సిన డీసీపీ ఎంఐఎం గుండాలకు సహకరిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. హైకోర్టు ఉత్తర్వులు వున్నా డీసీపీ పట్టించుకోలేదన్నారు. బీజేపీ కార్యకర్తలు, మహిళలపై డీసీపీ దాడి చేశారని సంజయ్ ఆరోపించారు.

తాము భారత్ మాతాకీ జై అంటుంటే.. అక్కడ దానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. హైకోర్టు ఉత్తర్వులు చూపించినప్పటికీ డీసీపీ పట్టించుకోలేదని సంజయ్ ఎద్దేవా చేశారు.

ప్రభుత్వ దేవాదాయ భూమిని కాపాడాలని బీజేపీ ఆందోళన చేస్తుంటే తమ కార్యకర్తలను అరెస్టు చేయడమేంటని ధ్వజమెత్తారు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కబ్జాదారులకు పోలీసులు అండగా ఉండడం దారుణమని వ్యాఖ్యానించారు.

డీసీపీని పంపింది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరేనని సంజయ్ ఆరోపించారు. కాగా, పాతబస్తీలోని ఉప్పుగూడ కాళికామాత దేవాలయంకు సంబంధించిన 24, 25, 26 సర్వే నెంబర్లలోని రూ. 70 కోట్ల విలువ చేసే 7 ఎకరాల 13 గుంటల స్థలం ఘర్షణకు దారి తీసిన సంగతి తెలిసిందే.