తెలంగాణలో రాక్షస పాలన కొనసాగుతోందని విమర్శించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సంజయ్‌ మాట్లాడారు.

రైతులపై కేసీఆర్‌ కపట ప్రేమ చూపిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. భూసార పరీక్షలకు కేంద్రం రూ.125 కోట్లు విడుదల చేసినా ఆ నిధులు ఎక్కడికెళ్లాయో అర్థం కావడం లేదన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ నేతలు కృత్రిమ ఉద్యమం చేశారని సంజయ్ ఆరోపించారు. బంద్‌లో రైతులు ఎక్కడా పాల్గొనలేదని.. కొత్త వ్యవసాయ చట్టాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పకుండా సీఎం ముఖం చాటేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

కేసీఆర్‌కు ఎన్నికలప్పుడు మాత్రమే రైతుబంధు గుర్తొస్తోందని... రైతుల రుణాలను ఎందుకు మాఫీ చేయలేదని సంజయ్ ప్రశ్నించారు. సన్నరకం ధాన్యానికి రూ.2,500 ధర, రుణమాఫీ, రైతుబంధు తేదీలు ప్రకటించాలనే డిమాండ్లతో త్వరలో బీజేపీ కిసాన్‌మోర్చా ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

30 లక్షల ఎకరాల్లో రైతులు సన్న వడ్డు వేశారని.. కొనుగోలు మాత్రం ఎందుకు సాగడం లేదని బండి సంజయ్ నిలదీశారు. రైతు పండించిన పంట తనకు తానే ధర నిర్ణయించడం తప్పా అన్న విషయాన్ని కేసీఆర్ స్పష్టం చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు.

రైతు పండిన పంట ఎక్కడైనా అమ్ముకునే ..స్వేచ్ఛా మార్కెట్ కల్పించటం తప్పా అని ఆయన ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ చావు దెబ్బతిందని సంజయ్ ఎద్దేవా చేశారు.

టీఎన్జీవో నేతలు బరితెగించి ప్రవర్తిస్తున్నారని... తనతో ఫోటో దిగినందుకు ఉద్యోగిని సస్పెండ్ చేశారని సంజయ్ మండిపడ్డారు. అలాగే పోలీస్ వ్యవస్థ సైతం స్వతంత్రంగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు.