Asianet News TeluguAsianet News Telugu

కరోనా సాకుతో ఉపఎన్నిక వాయిదా.. మరి స్కూళ్లు ఎందుకు తెరిచినట్లు: కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్

కొవిడ్ సాకుతో హుజూరాబాద్ ఉప ఎన్నికలను వాయిదా వేయించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. విద్యా సంస్థలను ప్రారంభించడం ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. ఓడిపోతారనే భయంతోనే టీఆర్ఎస్ నేతలు ఉప ఎన్నికను వాయిదా వేయించారని సంజయ్ ఆరోపించారు. 
 

telangana bjp chief bandi sanjay slams cm kcr over huzurabad by election
Author
Hyderabad, First Published Sep 5, 2021, 5:34 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్‌లపై విరుచుకుపడ్డారు తెలంగాణ బీజేపీ  అధ్యక్షుడు బండి సంజయ్. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మాందాన్ పల్లి శిబిరంలో బండి సంజయ్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం టీచర్లను బండి సంజయ్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్ సాకుతో హుజూరాబాద్ ఉప ఎన్నికలను వాయిదా వేయించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. విద్యా సంస్థలను ప్రారంభించడం ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు. ఓడిపోతారనే భయంతోనే టీఆర్ఎస్ నేతలు ఉప ఎన్నికను వాయిదా వేయించారని సంజయ్ ఆరోపించారు. 

కార్పొరేట్ స్కూళ్లు ఒక్కో విద్యార్థి నుంచి రూ.లక్షలు వసూలు చేసి టీఆర్ఎస్ నేతలకు కమీషన్లు ఇచ్చాయని బండి సంజయ్ ఆరోపించారు. ఫీజులు వసూలు చేసిన తర్వాత కార్పొరేట్ సంస్థలు కోవిడ్ సాకుతో స్కూళ్లను మూసేసిన విషయాన్ని గుర్తు చేశారు. దేశానికి, సమాజానికి ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలను కొనియాడారు. తాను ఈ స్థాయిలో ఉన్నాననంటే తన తండ్రి టీచర్ కావడమే కారణమన్నారు.

తన తండ్రి వల్ల దేశం, ధర్మం గురించి ఆలోచించడం నేర్చుకోవడంతోపాటు నిత్యం ఆర్ఎస్ఎస్ శాఖ సమావేశాలకు వెళుతూ ఈ స్థాయికి చేరుకున్నానని బండి సంజయ్ గుర్తుచేశారు. రాష్ట్రంలో కిలోమీటర్‌కు ఓ పాఠశాల ఉండాలని.. కేసీఆర్ పాలనలో అందుకు భిన్నంగా కిలోమీటర్‌కు ఓ వైన్స్ షాపు, బార్ ఉన్నాయని విమర్శించారు. కొత్త టీచర్ పోస్టుల భర్తీ ఊసే లేదని, ఉన్న స్కూళ్లను మూసివేయిస్తూ టీచర్ల సంఖ్యను తగ్గిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ ఉపాధ్యాయ సంఘాలను రద్దు చేస్తానని బెదిరించడంతో భయపడిన టీచర్లు టీఆర్ఎస్‌కు ఓటేసి పొరపాటు చేశారని పేర్కొన్నారు. దేశాన్ని తీర్చిదిద్దాల్సిన టీచర్లే భయపడితే ఇక సమాజం పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలని బండి సంజయ్ కోరారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios