తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. 18 ఏళ్లు నిండిన దేశ ప్రజలకు ఉచిత వ్యాక్సిన్‌ వేస్తామని ప్రధాని మోడీ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల తరఫున ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. స్వదేశీ వ్యాక్సిన్‌ తయారు చేసుకోలేక పోతే రూ.లక్షల కోట్లు నష్టపోయే వాళ్లమని సంజయ్ అభిప్రాయపడ్డారు.

వ్యాక్సినేషన్‌లో భాగంగా ఇప్పటి వరకు కేంద్రం తెలంగాణకు 80 లక్షల డోసులు ఇచ్చిందన్నారు. జూన్‌లో 20, జులైలో 20 లక్షల వ్యాక్సిన్‌ డోసులు తెలంగాణకు వచ్చే అవకాశముందని బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రధాని నిర్ణయం పట్ల పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభినందనలు చెబుతుంటే కేసీఆర్‌ పత్తా లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. కేంద్రం అందించే అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించడంలో సీఎం కేసీఆర్‌ నిర్లక్ష్యంగా వహిస్తున్నారని సంజయ్ విమర్శించారు.   

Also Read:జూన్ 21 నుంచి ఫ్రీ వ్యాక్సినేషన్.. రంగంలోకి కేంద్రం, 44 కోట్ల డోసులకు ఆర్డర్

కేంద్రం ఉచిత వ్యాక్సిన్‌ ఇస్తుందని కేసీఆర్‌ బాధపడుతున్నారని, అందుకే ప్రధానికి కృతజ్ఞతలు చెప్పలేదని ఆయన ఆరోపించారు.  కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని సంజయ్ సూచించారు. కరోనా కట్టడికి రూ.2,500 కోట్లు కేటాయించానని సీఎం చెప్పారని.. మరి ఆ నిధులు ఎక్కడికి పోయాయని ఆయన ప్రశ్నించారు. రూ.500 కోట్లు కేటాయిస్తే శాశ్వత వైద్యులు, సిబ్బందిని నియమించుకోవచ్చని బండి సంజయ్ సూచించారు. ఇప్పటికైనా డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది నియామకానికి సీఎం చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.