తమ పార్టీపై విశ్వాసంతో విజయాన్ని అందించిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. హైదరాబాద్ ‌లోని రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పుగా సంజయ్ అభివర్ణించారు.

కేసీఆర్ అహంకారం, స్వార్థపూరిత రాజకీయాలు, అవినీతి పాలన, అబద్ధాల పాలన, నిరంకుశ పాలనకు దుబ్బాక ప్రజలు సమాధి కట్టారని ఆయన చెప్పారు. బీజేపీ ఎక్కడుందని కొన్ని సందర్భాల్లో సీఎం అన్నారని.. అయితే తమ పార్టీ గజ్వేల్‌కు కేవలం ఒక కిలోమీటర్ దూరంలో, సిరిసిల్లకు మూడు కిలోమీటర్ల దూరంలో వుందని సంజయ్ సెటైర్లు వేశారు.

దుబ్బాక విజయం స్పూర్తితో తమ జైత్రయాత్ర కొనసాగుతుందని.. గొల్కొండ ఖిల్లా మీద కాషాయ జెండాను రెపరెపలాడించే వరకు ఇలాగే ముందుకు వెళ్తామన్నారు. అనేక సందర్భాల్లో బీజేపీ కార్యకర్తలను, నాయకులను, స్వయంగా అభ్యర్ధులను ఇబ్బంది పెట్టించేందుకు యత్నించారని అయినప్పటికీ అన్నింటిని భరించి దుబ్బాకలో విజయం సాధించామని బండి సంజయ్ స్పష్టం చేశారు.

Also Read:ఓటమికి బాధ్యత వహిస్తున్నా: దుబ్బాక బైపోల్‌ రిజల్ట్స్ పై హరీష్ రావు

టీఆర్ఎస్ అబద్ధాలను నిజాలుగా, అవాస్తవాలను వాస్తవాలుగా అడ్డగోలుగా డబ్బు ఖర్చు పెట్టి ఓట్లను కొనుగోలు చేసి గెలిచే ప్రయత్నం చేసిందని ఆయన ఆరోపించారు. అభివృద్ధి పనుల కోసం నరేంద్రమోడీ ప్రభుత్వం ఇచ్చిన నిధులతో జేబులు నింపుకుని దుబ్బాక ఎన్నికల్లో ఓట్లను కొనుగోలు చేసే ప్రయత్నం చేశారని.. అందువల్ల డబ్బులు తీసుకోవాల్సిందిగా చెప్పామన్నారు.

కుల భవనాల పేరుతో టీఆర్ఎస్ పార్టీ కుల రాజకీయాలు చేసిందని.. అధికారంలో తామే వున్నామని, తమకు ఓట్లేస్తేనే అభివృద్ధి జరుగుతుందని టీఆర్ఎస్ ప్రజలను మోసం చేస్తోందని సంజయ్ ఆరోపించారు. మేం చేసిన సవాల్‌తో దుబ్బాకలో కేసీఆర్ ప్రచారం చేయలేదని ఆయన ఎద్దేవా చేశారు.

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లో ఎన్నో ప్రాంతాలు మునిగిపోయాయని.. కిషన్ రెడ్డి స్వయంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు విడుదల చేయించారని బండి సంజయ్ గుర్తుచేశారు.

హైదరాబాద్‌లో ఉండి.. హైదరాబాద్ ప్రజలను పట్టించుకోని ముఖ్యమంత్రి, దుబ్బాకలో ఇబ్బంది వస్తే ఎలా పట్టించుకుంటారని అక్కడి ప్రజలు ఆలోచించారని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల అహంకారాన్ని దుబ్బాక ప్రజలు దెబ్బతీశారని సంజయ్ అన్నారు.

తెలంగాణలో బీజేపీని అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన చెప్పారు. అమరవీరులను స్మరించుకోవాల్సిన ముఖ్యమంత్రి.. నిజాం సమాధి వద్ద మోకరిల్లారని మండిపడ్డారు.

కానీ తాము దుబ్బాకలో విజయం సాధించిన తర్వాత.. సర్దార్ పటేల్ విగ్రహం వద్ద మోకరిల్లబోతే వందలాది మంది పోలీసుల చేత అడ్డుకున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ఇంకా అహంకారం వదులుకోకపోతే ప్రజలు గట్టి బుద్ధి చెబుతారని ఆయన జోస్యం చెప్పారు.