ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు పదే పదే బయటకు వచ్చినా సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.  కేసీఆర్ అరాచకాలను శివుడు చూస్తున్నాడని, అందుకే ఛార్జ్‌షీట్‌లో ఆయన కుమార్తెపేరు వుందన్నారు. 

సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తీవ్ర విమర్శలు చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పేరు ఉద్దేశించకుండా దొంగ సారా దందా ఛార్జ్‌షీట్‌లో కవిత పేరు 4 సార్లు వుందన్నారు. ఈ కేసులో కేసీఆర్ కూతురు రూ.100 కోట్లను తీసుకుపోయిందని సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ అరాచకాలను శివుడు చూస్తున్నాడని, అందుకే ఛార్జ్‌షీట్‌లో ఆయన కుమార్తెపేరు వుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఛార్జ్‌షీట్‌లో కూతురు పేరు వస్తే కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. హిందూ ధర్మాన్ని విమర్శించడం కొందరికి ఫ్యాషన్‌గా మారిందని.. తాము రాజకీయాల కోసం హిందూ ధర్మాన్ని వాడుకోమని బండి సంజయ్ స్పష్టం చేశారు. 

అంతకుముందు గురువారం బండి సంజయ్ మాట్లాడుతూ.. మహారాష్ట్రకు వెళితే కేసీఆర్‌ను ఎవరు అంటున్నారని ఆయన సెటైర్లు వేశారు. టీఆర్ఎస్, బీఆర్ఎస్.. ఇక మిగిలింది వీఆర్ఎస్సేనని సంజయ్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ దోచుకునే పార్టీ అని.. కుటుంబ పాలన అని దుయ్యబట్టారు. ఈ ఏడాదిలో 18 లక్షల ఉద్యోగాలిస్తున్నది బీజేపీ ప్రభుత్వమేనని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణలో 22 నోటిఫికేషన్లు ఇచ్చారు కానీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీని పక్కనబెట్టారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also REad: ఢిల్లీ లిక్కర్ స్కాం : మరోసారి కల్వకుంట్ల కవిత పేరు.. రాఘవరెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో ప్రస్తావించిన ఈడీ

ఇకపోతే.. జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవిత పేరును మరోసారి ప్రస్తావించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. కవిత ప్రతినిధిగా అరుణ్ పిళ్లై వ్యవహరించారని ఈడీ తెలిపింది. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి మాగుంట రాఘవరెడ్డికి 10 రోజుల ఈడీ కస్టడీ విధించింది ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్ట్. కాగా.. ఈ కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొడుకు రాఘవ రెడ్డిని ఈడీ అధికారులు గత శనివారం అరెస్ట్ చేశారు. కోర్టుకు సమర్పించిన చార్జ్‌షీట్‌లో ఈడీ.. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ రెడ్డి పేర్లను ప్రస్తావించిన సంగతి తెలిసిందే.