సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లర్ల వెనుక రాష్ట్ర ప్రభుత్వం వుందంటూ ఆయన ఆరోపించారు. ఇంటెలిజెన్స్ సమాచారం వున్నా పోలీసులు  పట్టించుకోలేదని సంజయ్ వ్యాఖ్యానించారు.  

అగ్నిపథ్ పథకాన్ని (agnipath) వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో (secunderabad railway station) చోటు చేసుకున్న ఆందోళనలపై తెలంగాణ బీజేపీ (bjp) చీఫ్ బండి సంజయ్ (bandi sanjay) స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అగ్నిపథ్ మంచి పథకమని.. అయినప్పటికీ నిరసన తెలిపే పద్ధతి ఇది కాదని హితవు పలికారు. సికింద్రాబాద్ విధ్వంసం వెనుక ఎవరున్నారని ఆయన ప్రశ్నించారు. రాళ్లు వేసింది ఎవరో తెలియదని.. గోడలు కూల్చారంటూ అనుకోకుండా జరిగింది కాదని సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ సమాచారం వున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే సంఘ విద్రోహ శక్తులు రెచ్చిపోయారని సంజయ్ ఆరోపించారు. 

మరోవైపు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌‌లో చోటుచేసుకున్న అల్లర్ల ఘటనకు సంబంధించి పోలీసులు 22 మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. స్టేషన్ వద్ద నిరసనకు వాట్సాప్ గ్రూప్‌లు వేదికగా ప్లాన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా కొందరు వ్యక్తులు ఆడియో సందేశాల్లో నిరసలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలంటే.. రైళ్లకు నిప్పుపెట్టాలని పేర్కొన్నట్టుగా చెబుతున్న క్లిప్పింగ్స్ వైరల్ అవుతున్నాయి.

ALso Read:సికింద్రాబాద్‌ అల్లర్ల ఘటనలో 22 మంది అరెస్ట్‌.. ఆందోళనల్లో ఎక్కువగా పాల్గొన్నది వాళ్లే..!

ఇక, ఈ నిరసనల వెనక గుంటూరులోని సాయి డిఫెన్స్ అకాడమీ (sai defence academy) డైరెక్టర్ ఆవుల సుబ్బారావు (avula subbarao) కీలక సూత్రధారి అని పోలీసులు నిర్దారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు సుబ్బారావును అరెస్ట్ చేశారు. పక్కా ప్రణాళికతోనే విధ్వంసం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన వెనక సుబ్బారావుతో పాటు, మరికొన్ని కోచింగ్ అకాడమీల ప్రమేయం ఉన్నట్టుగా పోలీసులు గుర్తించినట్టుగా కొన్ని న్యూస్ చానల్స్ కథనాలు ప్రచురించాయి. ఈ క్రమంలోనే పోలీసులు 22 మందిని అరెస్ట్ చేశారు. ఆందోళనలో ఎక్కువగా సాయి డిఫెన్స్ అకాడమీ అభ్యర్థులే పాల్గొన్నారని పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. 

ఆందోళనల్లో పాల్గొన్న సాయి డిఫెన్స్ అకాడమీ చెందిన 450 అభ్యర్థులను పోలీసులు గుర్తించినట్టుగా సమాచారం. వీరంతా గుంటూరు నుంచి హైదరాబాద్‌ వచ్చారు. గుంటూరు‌తో పాటు మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఉన్నట్టుగా పోలీసులు నిర్దారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. 

అయితే మూడు రోజుల క్రితం అగ్నిపథ్ స్కీమ్ ప్రకటన వెలువడగానే.. ఒక్కసారి ఈ వాట్సాప్‌ గ్రూప్‌లు యాక్టివ్‌ అయ్యాయి. అగ్నిపథ్ స్కీమ్‌ గురించి వాట్స్‌ప్‌ గ్రూప్‌లలో తీవ్ర చర్చ సాగింది. అగ్నిపథ్ స్కీమ్ వల్ల ఆర్మీ తమ కేరీర్ అవకాశాలు దెబ్బతింటాయని వారు భావించారు. ఈ క్రమంలోనే దేశంలోని ఇతర ప్రాంతాల్లో అగ్నిపథ్‌ స్కీమ్‌కు వ్యతిరేకంగా నిరసనల గురించి తెలియడంతో.. సికింద్రాబాద్‌ వద్ద కూడా నిరసన తెలియజేయాలని వారు వాట్సాప్ గ్రూప్‌ ద్వారా మెసేజ్‌లు, ఆడియో క్లిప్స్ షేర్ చేసుకున్నారు.