ధరణిని రద్దు చేయం, కేసీఆర్ పథకాలు వుంటాయి : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక ధరణి పోర్టల్‌ను కొనసాగిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్. అలాగే కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వుంటాయని స్పష్టం చేశారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేయబోమని స్పష్టం చేశారు. ధరణి కేసీఆర్ కుటుంబానికి అనుకూలంగా వుందని.. దానిని ప్రజలకు తగిన విధంగా మారుస్తామని బండి సంజయ్ తెలిపారు. ధరణిలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలను సైతం పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కొనసాగిస్తామని సంజయ్ స్పష్టం చేశారు.
ఇదే సమయంలో కాంగ్రెస్, కేసీఆర్ లపై ఆయన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీని పైకి లేపడానికి మోడీ మాకు మిత్రుడేనని సీఎం అంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడని సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోడీ కేబినెట్‌లో వున్న వారిపై ఒక్క అవినీతి మరక లేదని.. కేసీఆర్ కేబినెట్‌లో అవినీతి మరకలేని మంత్రి లేడని సంజయ్ ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీలో ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ అభ్యర్ధులను కేసీఆర్ తయారు చేస్తున్నారని.. కర్ణాటకలో ఆ పార్టీకి డబ్బులు అందించాడని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీని ఓడించడానికి దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కేసీఆర్ డబ్బులు పంపిస్తున్నారని సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ , బీఆర్ఎస్ ఒక్కటేనని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని బండి సంజయ్ దుయ్యబట్టారు.