Hyderabad: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత పై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై పోలీసు కేసు నమోదైంది. అలాగే, మహిళా కమిషన్ కు సైతం బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై బండి సంజయ్ స్పందించారు.
Telangana BJP chief Bandi Sanjay Kumar: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ పై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశాయి. అలాగే, మహిళా కమిషన్ కు సైతం బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై బండి సంజయ్ స్పందించారు. తనకు నోటీసులు వస్తే మహిళా కమిషన్ ముందు హాజరవుతానని తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తమ ముందు విచారణకు హాజరుకావాలని ఈడీ ఎమ్మెల్సీ కవితను కోరింది. ఈ క్రమంలోనే కవితను టార్గెట్ చేస్తూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ విమర్శలు గుప్పించారు. కవిత-ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం-అరెస్ట్ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ.. ‘కవితని అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా…’ అంటూ కామెంట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవిత వికెట్ పడిపోయిందని.. అతి త్వరలో బీఆర్ఎస్‌లో మరికొంతమంది క్లీన్ బౌల్డ్ అవుతారని అన్నారు. మద్యం కుంభకోణం, గ్యాంబ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు.
ఆయన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పలు కోట్ల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. అలాగే, మహిళా కమిషన్ కు సైతం ఫిర్యాదు చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆయన వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని పేర్కొంది. ఆయన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్.. విచారణ జరపాలని డీజీపిని ఆదేశించింది. వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. బండి సంజయ్ ఈ విషయంపై స్పందిస్తూ.. నోటీసులు అందితే స్వయంగా మహిళా కమిషన్ ముందు తాను హాజరవుతానని తెలిపారు. ఇప్పటివరకు మహిళా కమిషన్ నుంచి నోటీసులు అందలేదని పేర్కొన్నారు.
