దమ్ముంటే నాతో రాజకీయం చేయండి.. కుమారుడి ర్యాగింగ్ వీడియోపై బండి సంజయ్ కామెంట్స్
తన కుమారుడి వీడియోపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. దమ్ముంటే తనతో రాజకీయం చేయాలని.. కేసీఆర్ మనవడి విషయంలో కొందరు కామెంట్ చేస్తే తాను ఖండించినట్లు సంజయ్ గుర్తుచేశారు.
తన కుమారుడి వీడియోపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. తన కొడుకుపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టారని.. పిల్లల జీవితాలతో ఎలా ఆడుకుంటారని ఆయన ప్రశ్నించారు. దమ్ముంటే తనతో రాజకీయం చేయాలంటూ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. పిల్లలు పిల్లలు కొట్టుకుంటారు.. కలుస్తారని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల నుంచి దృష్టి మళ్లించేందుకు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కొడుకు మందు కోసం ఖాజాగూడలో గొడవ చేయలేదని.. తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ మనవడి విషయంలో కొందరు కామెంట్ చేస్తే తాను ఖండించినట్లు సంజయ్ గుర్తుచేశారు. సీఎం పాపం పండిందని ఆయన జోస్యం చెప్పారు.
అసలేం జరిగిందంటే :
హైదరాబాద్‌లోని మహీంద్రా యూనివర్సిటీలో చదువుతున్న భగీరథ్ ర్యాగింగ్ పేరుతో తన తోటి విద్యార్ధిపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో బాధితుడిపై భగీరథ్ అసభ్య పదజాలంతో దూషించాడు. అతనితో పాటు స్నేహితులు కూడా బాధిత విద్యార్ధినిని చితకబాదారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో బాగా వైరల్ అయ్యింది. దీనిని పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకోవడంతో భగీరథ్‌పై దుండిగల్ పీఎస్‌లో కేసు నమోదైంది. అయితే గతంలోనూ భగీరథ్ ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్న రోజుల్లో ఇలాగే గొడవలకు దిగినట్లుగా తెలుస్తోంది. దీంతో వర్సిటీ యాజమాన్యం అతనిపై చర్యలు తీసుకున్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.