ధాన్యం కొనుగోలుకు సంబంధించి టీఆర్ఎస్ చేస్తున్న నిరసన వెనుక పెద్ద కుంభకోణం వుందని... కోట్లాది రూపాయల కమీషన్ వచ్చే స్కెచ్‌ గీశారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. ఈ మేరకు రైతులకు లేఖ రాశారు. 

రైతన్నలకు తెలంగాణ బీజేపీ (bjp) చీఫ్ బండి సంజయ్ (bandi sanjay) శనివారం బహిరంగ లేఖ రాశారు. టీఆర్ఎస్ (trs) వడ్ల రాజకీయం వెనుక మహా కుట్ర వుందని ఆయన ఆరోపించారు. భారీ ఎత్తున కమీషన్లు దండుకునేందుకు గులాబీ దండు స్కెచ్ వేసిందని.. రైతులు అనివార్యంగా తక్కువ ధరకే వడ్లు విక్రయించేలా (paddy procurement) ప్లాన్ చేశారని బండి సంజయ్ ఆరోపించారు. రైతుల్లో వచ్చే ఆగ్రహాన్ని కేంద్రంపై మళ్లించే ఎత్తుగడ వేశారని ఆయన వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల మూసివేత అందులో భాగమేనని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ (kcr) ర‌చించిన ఈ కుట్ర‌లో అన్న‌దాత‌ల‌కు భారీ ఎత్తున న‌ష్టం వాటిల్లే ప్ర‌మాద‌ముంద‌ని ఆయ‌న ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను తిరిగి తెరిచేలా కేసీఆర్ మెడ‌లు వంచుదాం రండి అంటూ బండి సంజయ్ రైతుల‌కు పిలుపునిచ్చారు. 

బ్రోకర్ల మాఫియాతో కలిసి పెద్ద స్కెచ్ వేశారని, దీని వెనుక వందల కోట్ల రూపాయలు కమీషన్ల పేరిట ప్రభుత్వ పెద్దలకు ముట్టబోతున్నాయని బండి ఆరోపించారు. రైతులు పంట ఎందుకు కొనడం లేదని నిలదీసే అవకాశం ఉన్నందున… ఆ నెపాన్ని కేంద్రంపై రుద్ది బద్నాం చేయడమే లక్ష్యంగా వడ్ల కొనుగోలు పేరిట డ్రామాలాడుతున్నారని ఆయన మండిపడ్డారు. వడ్ల పేరుతో మరోసారి ‘తెలంగాణ సెంటిమెంట్’ ను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న డ్రామాలను తెలంగాణ రైతాంగం గమనించాలని సూచించారు. మంచి చేస్తాడని ఓట్లేస్తే… లేని సమస్యను సృష్టించి రాజకీయాలు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు, టీఆర్ఎస్ పార్టీ నేతలకు తగిన బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. న్యాయ నిర్ణేతలు మీరేనని….ఒక్కసారి ఆలోచించాలని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు. 

ఇకపోతే.. నిన్న బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌ని డ్రగ్స్‌కు (drugs) అడ్డాగా మార్చిన ఘనత టీఆర్ఎస్ (trs) ప్రభుత్వానిదేనన్నారు . డ్రగ్స్‌తో సంబంధం వున్న 15 మంది ఐటీ ఉద్యోగులను తొలగించారని ఆయన చెప్పారు. డ్రగ్స్‌ను నిర్మూలిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఉడ్తా హైదరాబాద్ అనే పరిస్ధితి తీసుకొచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. డ్రగ్స్ వల్లే పంజాబ్‌లో ప్రభుత్వం కూలిపోయిందని బండి సంజయ్ గుర్తుచేశారు. కెల్విన్ అనేక పేర్లు చెప్పాడని పోలీసులు చెప్పారని.. వాళ్లంతా ఏమయ్యారని ఆయన ప్రశ్నించారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ ఏమైందని బండి సంజయ్ నిలదీశారు. ఈడీకి ఎందుకు సహకరించడం లేదని ఆయన ప్రశ్నించారు.