అంతా డొల్లే.. చివరి ఏడాదీ మొండిచేయే, పిల్లలకు మళ్లీ పురుగుల అన్నమే : బడ్జెట్‌పై బండి సంజయ్ విమర్శలు
దళిత సమాజాన్ని మోసం చేసేలా బడ్జెట్ వుందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. బడ్జెట్ అంతా శుష్క వాగ్ధానాలు.. శూన్య హస్తాలే అన్నట్లుగా వుందని ఆయన దుయ్యబట్టారు. ఈసారి కూడా బీసీ విద్యార్ధులకు పురుగుల అన్నమే దిక్కు కాబోతోందని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.

తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఇది ఎలక్షన్ స్టంట్‌ను తలపిస్తోందని.. అంతా డొల్ల బడ్జెట్ అని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ సహా అన్ని వర్గాలను పూర్తిగా వంచించేలా బడ్జెట్‌ను రూపొందించారని బండి సంజయ్ ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో, పలు సందర్భాల్లో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో చివరి సంవత్సరం కూడా మొండి చేయి చూపారని సంజయ్ ఎద్దేవా చేశారు. దళిత సమాజాన్ని మోసం చేసేలా బడ్జెట్ వుందని, ఈసారి కూడా బీసీ విద్యార్ధులకు పురుగుల అన్నమే దిక్కు కాబోతోందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
విద్య, వైద్య రంగాలకు కేటాయింపులు చూస్తుంటే మధ్య తరగతి ప్రజలపై మరింత భారం మోపేలా బడ్జెట్ కేటాయింపులు వున్నాయంటున్నారు. డిస్కంలను మరింత సంక్షోభంలో నెట్టేలా కేటాయింపులు వున్నాయని బండి సంజయ్ విమర్శించారు. రూ.2,90,396 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం రూ.1.31 లక్షల కోట్లను ఆదాయంగా చూపిందని, మరి మిగిలిన రూ.1.60 కోట్లు ఎక్కడి నుంచి సమకూరుస్తారో చెప్పలేదని ఆయన ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు, పన్నుల రూపంలో రూ.62 వేల కోట్లకు పైగా చెల్లిస్తోందని బండి సంజయ్ గుర్తుచేశారు. బడ్జెట్ అంతా శుష్క వాగ్ధానాలు.. శూన్య హస్తాలే అన్నట్లుగా వుందని ఆయన దుయ్యబట్టారు.
ALso REad: తెలంగాణ బడ్జెట్ లో శాఖల వారిగా నిధుల కేటాయింపు వివరాలు
అంతకుముందు మంత్రి హరీష్ రావు చేసిన ప్రసంగంపై మాజీ ఆర్థిక మంత్రి, బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. రెండు లక్షల తొంబై కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టడం కాదు... ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా మొదటివారంలో జీతాలివ్వండి అంటూ ఎద్దేవా చేసారు. కనీసం జీతభత్యాలు సరిగ్గా ఇవ్వలేని పరిస్థితిలో కేసీఆర్ సర్కార్ వుందని... ఇదేం గొప్పతనమో ఆర్థిక మంత్ర హరీష్ రావు చెప్పాలని ఎమ్మెల్యే ఈటల అన్నారు. ఇక తెలంగాణలో విద్యావ్యవస్థను ఉద్దరించామని చెబుతున్న బిఆర్ఎస్ ప్రభుత్వం... హైదరాబాద్ నడిబొడ్డును బాత్రూంల కోసం సర్కారు బడిలో చదివే అమ్మాయిల రోడ్డెక్కడం గురించి మాట్లాడాలని ఈటల సూచించారు. చదువులతల్లి నిలయమైన బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు కనీస సౌకర్యాల కోసం ఆందోళనలకు దిగారంటేనే పరిస్థితి ఎలా వుందో అర్థమవుతుందన్నారు. తెలంగాణలో విద్యావ్యవస్థ ఇంత అద్వాన్నంగా వుంటే తామేదో మార్చేసినట్లు హరీష్ అసెంబ్లీలో గొప్పగా ప్రకటనలు చేసారంటూ ఈటల రాజేందర్ మండిపడ్డారు.