Telangana: ప్రభుత్వ హాస్టల్ లో మందుతో విందు చేసుకున్నారు పలువురు విద్యార్థులు. బీర్లు తాగుతూ.. చికెన్ ముక్కలతో చిందులు వేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ ఘటనపై మంచిర్యాల జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి విచారణకు ఆదేశించారు.
Hostel Students Liquor Party: తెలంగాణలోని ఓ ప్రభుత్వ హాస్టల్ లోని విద్యార్థులు మందుతో విందు చేసుకున్నారు. బీర్లు తాగుతూ.. చికెన్ ముక్కలతో చిందులు వేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై బీసీ సంక్షేమశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. సదరు విద్యార్థులపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు.
వివరాల్లోకెళ్తే.. రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టల్ లోని విద్యార్థులు మందుతో విందు చేసుకుని.. బీర్లు తాగుతూ.. చికెన్ ముక్కలతో చిందులు వేసిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. దండేపల్లి మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలోని పలువురు విద్యార్థులు బీర్లు, చికెన్‌తో విందు చేసుకున్నారు. బీర్లు తాగుతూ.. చికెన్ ముక్కలు తింటూ.. చిందులేస్తూ దిగిన సెల్ఫీ ఫొటోలు సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపులలో వైరల్ అవుతున్నాయి. విద్యార్థుల మందు విందు గురించి అధికారులకు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈ మందు విందు పై మంచిర్యాల జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి విచారణకు ఆదేశించారు.
దండేపల్లి మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలోని మందు విందు ఈ నెల 17న ఆదివారం నాడు చోటుచేసుకుంది. ఆదివారం కావడంతో హాస్టల్ సిబ్బంది విద్యార్థులు తినడానికి చికెన్ కూర వండారు. అందరూ విద్యార్థులు భోజనశాల వద్దే తిన్నారు. కానీ.. కొందరు విద్యార్థులు మాత్రం అక్కడ తినకుండా..రాత్రి భోజనాన్ని తమ గదిలోకి తీసుకెళ్లారు. స్థానికంగా నివాసముండే విద్యార్థుల సాయంతో హాస్టల్ లోకి బీరు బాటిళ్లు తెప్పించుకున్నారు. ఇక మందు.. చికెన్ ముక్కలు తింటూ.. సెల్పీలు దిగారు. ఈ ఫొటోలను తమ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసుకున్నారు. వాట్సాప్ గ్రూపుల నుంచి సోషల్ మీడియాకు చేరిన ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. ఈ వ్యవహారం అధికారుల వరకు చేరింది. ఈ ఫొటోలు వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో కొందరు యువకులు కలెక్టర్, ఉన్నతాధికారులకు వాట్సా ప్‌తోపాటు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. విషయం తెలిసిన జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఖాజా నజీం అలీ అఫ్సర్ ఈ ఘటనపై బుధవారం విచారణకు ఆదేశించారు. అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ అధికారి భాగ్యవతి హాస్టల్‌ను సందర్శించి వార్డెన్ మల్లేశ్‌తోపాటు సిబ్బందిని ఈ ఘటనపై విచారించారు.
విద్యార్థులను కూడా దీనిపై ఆరా తీసినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి నివేదికను త్వరలోనే ఉన్నతాధికారులకు అందజేస్తానని అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ అధికారి భాగ్యవతి తెలిపారు. కాగా, ప్రభుత్వ వసతి గృహంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నదని ఆరోపణలు వస్తున్నాయి. అయితే, ఈ ఘటన చోటుచేసుకోవడానికి.. విద్యార్థులు బీర్లు హాస్టల్ లోకి తీసుకురావడానికి గత అంశాలను గమనిస్తే.. ఈ హాస్టల్ ఇండ్ల మధ్య ఉండటం కూడా కారణంగా తెలుస్తోంది. ఈ వసతిగృహానికి పక్కా భవనం లేకపోవడంతో గ్రామంలోని ఓ ప్రయివేటు పాఠశాలను అద్దెకు తీసుకుని అందులో నిర్వహిస్తున్నారు. ఇండ్ల మధ్యలో ఉండటంతో స్థానికంగా ఉండే తోటి విద్యార్థులు వీరికి బీరు బాటిళ్లను కిటికీల్లోంచి అందించినట్టు తెలిసింది. ఈ విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. వాచ్‌మెన్ పోస్టు ఖాళీగా ఉండటం.. వార్డెన్ అక్కడే ఉండకుండా.. లక్సెట్టిపేట నుంచి రాకపోకలు సాగిస్తుండటంతో వీరిపై పర్యవేక్షణ కరువైందని స్థానికులు పేర్కొన్నారు.
