ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన బంద్ శనివారం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. హైదరాబాదులో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు.

బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు లక్ష్మణ్ ను అబిడ్స్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసారు. అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. కోర్టు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ప్రజలు ఎమ్మెల్యేలను నెక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బంద్ కు అన్ని వర్గాల మద్దతు లభించిందని, బంద్ విజయవంతమైందని తెలిపారు. 

మరో సంఘటనలో తెలంగాణ బంద్ కు మద్దతుగా చార్మినార్ నుంచి ఎంజిబిఎస్ వరకు ర్యాలీగా బయల్దేరైనా కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని మార్గమధ్యంలోనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

ఇందులో భాగంగా హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద సిపిఐఎంఎల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.నిరసన వ్యక్తం చేస్తున్నవారిని పోలీసులు అరెస్టు చేసే క్రమంలో సీపీఐఎంఎల్  నేత పోటు రంగారావు చేతి బొటనవేలు తెగి పోయిందిపోలీసులు వ్యాన్ లో ఎక్కించే క్రమంలో రెండు తలుపుల మధ్య అతని వేలు పెట్టి నొక్కి కట్ చేశారని బాధితుడు ఆరోపిస్తున్నారు. 

"నన్ను కేసీఆర్ చంపమన్నాడా ? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు, ఇప్పుడు కార్మికుల పక్షాన నిలబడి పోరాడినందుకు ఇది నాకు బహుమనమా?" అని పోటు రంగారావు పోలీసులను ప్రశ్నించారు.

కొద్దిసేపటి కింద నారాయణగూడ వద్ద సిపిఐ నేత చాడ వెంకట రెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేసారు. నేటి ఉదయం జూబిలీ బస్సు స్టాండ్ ముట్టడికి యత్నించిన టీజెఎస్ అధ్యక్షుడు కోదండరాం ను పోలీసులు అరెస్ట్ చేసారు. వీరిని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆర్టీసీ కార్మికులతో వెంటనే ప్రభుత్వం చర్చలు జరపాలని ఈ సందర్భంగా కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులను పోలీసులు అరెస్ట్‌ చేశారు రాష్ట్రవ్యాప్తంగా పొద్దటి నుండి అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఎక్కడికక్కడ ధర్నాలకు దిగిన నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి సమీప పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. 

కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం,బీజేపీ ఇలా అన్ని పార్టీల కార్యకర్తలను నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ డిపోల ముందు ధర్నాలకు దిగిన కార్మికులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. కొన్నిచోట్ల ఈ అరెస్టులు తోపులాటలకు, ఘర్షణలకు కూడా దారి తీస్తున్నాయి. 

సమ్మెకు విద్యార్థి సంఘాలు కూడా మద్దతు ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు ఉస్మానియా యూనివర్సిటీ వద్ద కూడా భారీగా మోహరించారు. దాదాపుగా రాష్ట్రవ్యాప్తంగా 30వేల మంది పోలీసులు విధి నిర్వహణలో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. 

క్యాబ్ లు, ఆటోలు కూడా ఈ బంద్ కి మద్దతు ఇవ్వడం గమనార్హం. ఇన్ని రోజులు బస్సులు లేకపోయినా క్యాబులు, ఆటోలతో ప్రజలు తమ ప్రయాణాలను కొనసాగించారు.నేడు అవి కూడా బంద్ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో బంద్ ప్రశాంతంగా సాగుతోంది.

 ఇదిలా ఉండగా...బంద్ నేపథ్యంలో... డిపోల ఎదుట భారీగా పోలీసులను మొహరించారు. అర్ధరాత్రి నుంచి కార్మిక సంఘాల నేతలు ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ సమ్మె తర్వాత.. అరకొరగా నడుస్తున్న బస్సులను రోడ్డుమీదకు రాకుండా కార్మికులు అడ్డుకుంటున్నారు. పలుచోట్ల ఆందోళన చేస్తున్న ఆర్టీసీ కార్మికులనుకూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.