TRS-Balka Suman: తెలంగాణ ఉద్యమంలో తాము లాఠీ దెబ్బలు తింటుంటే.. నెవ్వెక్కడున్నావ్ అంటూ టీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్.. రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ ని ప్రశ్నించారు.
Balka Suman attacks BJP : తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ల మధ్య మాటల యుద్ధం మరింతగా ముదురుతోంది. దీంతో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. టీఆర్ఎస్ నాయకులు బీజేపీని టార్గెట్ చేస్తూ... తీవ్ర విమర్శలతో రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ పై టీఆర్ఎస్ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బండి సంజయ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయనది పాదయాత్ర కాదు.. పాపాలను కడుక్కునే యాత్ర అంటూ బండి సంజయ్ పై బాల్క సుమన్ ఫైర్ అయ్యారు.
టీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్యే నోముల భగత్‌తో కలిసి బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు. అడ్డుకోవడమే మీ పని అయితే కిషన్ రెడ్డి తెలంగాణలో తిరగలేడంటూ ఘాటుగా స్పందించారు. ఇలాగే ఆ పార్టీ నడుచుకుంటే బండి సంజయ్ పాదయాత్ర చేయలేడంటూ హెచ్చరించారు. ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఓర్వలేని తనంతోనే బీజేపీ నేతలు ఇలా చేస్తున్నారని అన్నారు. బీజేపీ నాయకుడిది పాదయాత్ర కాదు.. పాపాలను కడుక్కునే యాత్ర అంటూ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ అసమర్థత వల్ల దేశంలో కరెంట్ కోతలు ఏర్పడ్డాయన్నారు. అయితే, తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ను అందిస్తున్నదని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చామని చెప్పారు. రైతుల కోసం తీసుకువచ్చిన పథకాలతో తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని తెలిపారు
దేశ సంపదను బీజేపీ పార్టీ ప్రయివేటు వ్యక్తులకు అప్పనంగా కట్టబెడుతున్నదని ఆరోపించారు. బీజేపీని కమలం పార్టీ అనడం కంటే కార్పొరేట్ పార్టీ అనడం సబబుగా ఉంటుందని విమర్శించారు. వారి డబుల్ ఇంజిన్ కు దేశ ప్రజలు ఎర్రజెండా చూపిస్తారని హెచ్చరించారు. టీఆర్ఎస్ సర్కారుపై ఒక్క అవినీతి ఆరోపణకు సంబంధించి అయినా ఆధారాలు బయటపెట్టారా? అని కమలం పార్టీ నేతలను ప్రశ్నించారు. పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచిన చరిత్ర బీజేపీదేనన్నారు. ఏడున్నర టీఆర్ఎస్ ఫలాలు ప్రజలు అనుభవిస్తున్నారని చెప్పారు. వలసల జిల్లాగా ఉన్న పాలమూరు నుండి ప్రజలు తిరిగి స్వంత జిల్లాకే వస్తున్నారని చెప్పారు. బీజేపీ పాలనలో ఉన్నావ్, హత్రాస్ , లఖీంపూర్ లాంటి ఘటనలు చోటు చేసుకొన్నాయన్నారు.
నీరవ్ మోడీ,లలిత్ మోడీలు దేశం విడిచి పారిపోయాన్నారు. 11 లక్షల కోట్ల అప్పులను కార్పోరేట్ కంపెనీలకు మోడీ సర్కార్ రద్దు చేసిందన్నారు. కానీ పేదలకు ఏం చేసిందో చెప్పాలని సుమన్ ప్రశ్నించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, దళిత బంధు వంటి పథకాల రూపంలో తాము పేదలకు సహాయ పడుతున్నామని బాల్క సుమన్ వివరించారు. పేద ప్రజల ఇళ్లను బుల్‌డోజర్లతో కూల్చి వేస్తున్నారన్నారు. బీజేపీ మాయమాటలు ప్రజలు నమ్మరని పేర్కొన్నారు.
