న్యూఢిల్లీ: చట్ట సభలలో జరిగే చర్చలపై దేశ ప్రజలు ఆసక్తి చూపుతున్నారని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టటం చేశారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న చట్టసభల సమావేశాల్లో ఒక్క నిమిషం, ఒక్కపదం కూడా వృథా కారాదని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. 

న్యూఢిల్లీలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా నేతృత్వంలో జరిగిన అన్ని రాష్ట్రాల స్పీకర్ల సమావేశంలో పాల్గొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి 130కోట్ల మంది దేశ ప్రజలకు పార్లమెంట్, రాష్ట్ర శాసన సభలు ప్రతీకగా నిలుస్తాయని చెప్పుకొచ్చారు. 

దేశ ప్రజలకు మరింత మెరుగైన పాలన, సంక్షేమం, అభివృద్ధిలను అందించే క్రమంలో తీసుకోవాల్సిన అంశాలపై నిర్ణయాత్మక చర్చలు జరిగేది చట్టసభలలోనేనని చెప్పుకొచ్చారు. ఇక చట్టసభల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఆ అంశం పరిధిలోనే ఉండాలని సూచించారు. 

చర్చ పక్కదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. వ్యక్తిగత విమర్శలు, దూషణలతో సమయం వృథా అవుతుందన్నారు. చట్టసభలలో అల్లరి చేయడం ద్వారా మీడియాను ఆకర్షించేందుకు కొంతమంది సభ్యులు ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి ధోరణిని కట్టడి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ శాసన సభలో రోజుకు 10 ప్రశ్నలతో కూడిన క్వశ్చన్ అవర్ ఉందని తెలిపారు.  

సెప్టెంబర్ నెలలో ఉగాండా కంపాలో కామన్ వెల్త్ దేశాల స్పీకర్ల సదస్సు ఉందని స్పష్టం చేశారు. ఆ సదస్సుకు 53 దేశాలకు చెందిన స్పీకర్లు పాల్గొంటారన్నారు. సెప్టెంబర్ 24 నుంచి 29 వరకు సదస్సు నిర్వహించనున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు.