కేరళ: శాంతిగిరి సంస్థ అందించే ప్రకృతి వైద్యం ఎంతో అద్భుతంగా పనిచేయడంతోపాటు మంచి ఫలితాలను ఇస్తుందని తెలిపారు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. కేరళకు చెందిన ప్రకృతి, ఆయుర్వేద, ఆధ్యాత్మిక చికిత్సాలయం శాంతిగిరి వార్షికోత్సవం నవపూజితం 93వ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 

కేరళరాజధాని తిరువనంతపురంలోని శాంతిగిరి రీసెర్చ్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన 60 ఏళ్ల క్రితం ప్రముఖ ఆయుర్వేద, ప్రకృతి, ఆధ్యాత్మిక చికిత్స వైద్యులు నవజ్యోతిశ్రీ కరుణాకర్ గురువు కేరళలోని చిన్న పూరి గుడిసెలో ప్రారంభించిన శాంతిగిరి ఆశ్రమం నేడు దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరించడం గొప్ప విషయమని కొనియాడారు. 

తెలుగు రాష్ట్రాల్లో 5 శాఖలను కలిగి ఉండడంతో పాటు హైదరాబాద్ లో శిక్షణ సంస్థను నెలకొల్పి, యువతి, యువకులకు శిక్షణతో పాటు, ఉద్యోగులుగా నియమించి వారికి ఉపాధి కల్పించడం సంతోషంగా ఉందన్నారు. 

తాను కూడా హైదరాబాద్ లోని శాంతిగిరి సంస్థలో ప్రకృతి చికిత్స చేయించుకున్నట్లు పోచారం స్పష్టం చేశారు. తమ వద్దకు వచ్చే పేషంట్లకు సేవాభావంతో చికిత్స అందించడం శాంతిగిరి లక్ష్యం కావడం నిజంగా అభినందించదగ్గ విషయమన్నారు. 

స్వల్ప, దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స అందించడంతో పాటు, అవసరమైన ఆయుర్వేద ఔషధాలను స్వంతంగా తయారు చేసుకోవడం సంస్థ సామర్ధ్యాన్ని, సంస్థ పట్ల నమ్మకాన్ని మరింతగా పెంచుతాయని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా శాంతిగిరి సంస్థ నిర్వాహకులు, శిక్షణ అధ్యాపకులు, విద్యార్థులు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని ఘనంగా సన్మానించారు.