ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై మాజీ ఎమ్మెల్యేలు వెంటనే ప్రభుత్వ క్వార్టర్స్ ఖాళీ  చేయాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ప్రస్తుతం ఎన్నికైన ఎమ్మెల్యేలకు నివాస సదుపాయం కల్పించాలంటే అందుకు మాజీలు సహకరించాలన్నారు. ఎమ్మెల్యేలెవరు బయట ఉండకుండా ప్రభుత్వం అందించే నివాసగృహాల్లోనే వుండేటట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు పోచారం వెల్లడించారు. 

హైదర్ గూడ లోని కొత్తగా నిర్మించిన ఎమ్మెల్యేల నివాస గృహాలను ఇవాళ స్పీకర్ పోచారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిర్మాణం పూర్తయిన ఈ క్వార్టర్స్ ని త్వరలో ఎమ్మెల్యేలకు  కేటాయించనున్నట్లు ప్రకటించారు. 

 తెలంగాణ రాష్ట్రంలో నూతన శాసన సభ ఏర్పడిన తరువాత ఎమ్మెల్యేలకు అన్ని వసతులతో నివాస గృహాలు నిర్మించాలని భావించినట్లు తెలిపారు. అందుకోసం రూ.166 కోట్లతో హైదర్ గూడలో 120 క్వార్టర్స్ ను నిర్మాణం చేపట్టినట్లు  ఇప్పుడవి పూర్తయ్యాయని అన్నారు.వీటిని శాసన సభ సభ్యులతో పాటు మండలి సభ్యులకు కూడా కేటాయించనున్నట్లు స్పీకర్ వెల్లడించారు. 

అన్ని సదుపాయాలతో వీటిని అత్యంత నాణ్యతతో నిర్మించినట్లు తెలిపారు. ఇందులో క్లబ్ హౌస్, మార్కెట్ లతో పాటు ఇతర సముదాయాలను కూడా కల్పించామన్నారు. ఎమ్మెల్యేలతో పాటు ఉద్యోగులు, సర్వెంట్స్ ఉండడానికి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఇలాంటి సౌకర్యం దేశంలోని మరే రాష్ట్రంలో లేదని పోచారం తెలిపారు. 

అసెంబ్లీ అమెడిటి కమిటీ సిఫార్సు మేరకు త్వరలోనే కార్టర్స్ కేటాయింపు చేపట్టనున్నట్లు పోచారం తెలిపారు. ఈ కమిటీలో అన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులకు స్థానం కల్పించామన్నారు. సీఎం కేసీఆర్ తో సంప్రదించి ఈ నివాస  గృహ సముదాయాన్ని ప్రారంభించనున్నట్లు పోచారం వెల్లడించారు.