Asianet News TeluguAsianet News Telugu

కొత్త‌ పార్ల‌మెంట్ భ‌వ‌నానికి బీఆర్ అంబేద్క‌ర్ పేరు పెట్టాలి.. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన కేటీఆర్

కొత్త‌ పార్ల‌మెంట్ భ‌వ‌నానికి బీఆర్ అంబేద్క‌ర్ పేరు పెట్టాల‌ని తెలంగాణ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. దేశానికి దిశానిర్దేశం చేసి.. దారి చూపిన దార్శనికుడు అంబేద్కర్ అని అన్నారు.

Telangana Assembly session 2022 KTR Demands Ambedkar Name For New parliament Building
Author
First Published Sep 13, 2022, 12:51 PM IST

కొత్త‌ పార్ల‌మెంట్ భ‌వ‌నానికి బీఆర్ అంబేద్క‌ర్ పేరు పెట్టాల‌ని తెలంగాణ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఇందుకు సంబంధించిన తీర్మానం ప్రవేశపెడుతున్న సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. దేశానికి దిశానిర్దేశం చేసి.. దారి చూపిన దార్శనికుడు అంబేడ్కర్ అని అన్నారు. అంబేడ్కర్ మూల సిద్దాంతం.. ప్రజాస్వామ్యం, ఆయన లక్ష్యం.. సమానత్వం, ఆయన ఎంచుకున్న మార్గం.. ప్రజాస్వామ్యం అని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ అంబేడ్కర్ తత్వాన్ని ఆచరణలో చూపిందని అన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ ఏర్పాటు జరిగిందని చెప్పారు. 

‘‘ప్రజాస్వామ్యం- విద్య అనే పుస్తకంలో.. ప్రజాస్వామ్యం కేవలం పరిపాలనకు సంబంధించిన వ్యవహారం కాదని, ప్రజల జీవినానికి సంబంధించిందని, ప్రజాస్వామ్యం అంటేనే పరస్పరం సహకారంతో కూడిన ఒక జీవన విధానం అని అంబేడ్కర్ గొప్పగా నిర్వచించారు. రాజ్యాంగానికి శీర్షకలో.. స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వం విలసిల్లాలని పేర్కొన్నారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి మూల కారుకులు అంబేడ్కర్. రాజ్యాంగల్‌లో ఆర్టికల్ 3 లేకపోతే కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు అవకాశమే లేకుండా పోయేది. ప్రపంచం మెచ్చుకునే రాజ్యాంగాన్ని అంబేడ్కర్ రాశారు. అయితే రాజ్యాంగం మంచి చెడుల గురించి మాట్లాడనని అంబేడ్కర్ చెప్పారు. దానిని అమలు చేయడానికి ఎంచుకునే వాళ్లను బట్టే.. రాజ్యంగం మంచిగా ఉండొచ్చు, చెడుగా ఉండొచ్చని అన్నారు. రాజ్యాంగం దుర్వినియోగమైతే.. దానిని తగలబెట్టే మొదటి వ్యక్తిని తానే అవుతానని అంబేడ్కర్ చెప్పారు. 

1955 మార్చి 18న అంబేడ్కర్ రాజ్యసభలో మాట్లాడుతూ.. దేవుడి కోసం గుడి కడితే, ముందే ఒకవేళ దెయ్యం వచ్చి కూర్చుంటే.. గుడిని ధ్వంసం చేయక తప్పదు కదా అని అన్నారు . దేవతలు ఉండాల్సిన గుడిలో అసురలను ఉండనిస్తామా అని అంబేడ్కర్ అనడం జరిగింది. అంబేడ్కర్.. బడుగు, బలహీన వర్గాల నాయకుడు మాత్రమే కాదు.. మహాత్మ గాంధీకి ఏ మాత్రం తగ్గని మహానుభావుడు ఆయన.

స్త్రీల హక్కుల కోసం పోరాడి పదవిని ఒదులుకున్న మహానుభావుడు అంబేడ్కర్. రాజ్యాంగాన్ని ఆమోదించ తర్వాత హిందు కోడ్ బిల్లును కూడా అంబేడ్కర్ రూపొందించారు. అందులో తండ్రి ఆస్తిలో సమాన హక్కు, వారసత్వ హక్కు, బహు భార్యత్వం రద్దు, విడాకులు, పునర్వివాహం వంటి ప్రగతిశీల అంశాలను పొందుపరిచి.. మహిళలకు కూడా సమాన హక్కులు ఉండాలని గొప్పగా రూపొందించారు. ఆ బిల్లు ఆమోదం పొందలేదని బాధతో, ఆవేదనతో రాజీనామా చేశారు. ఆర్టికల్ 3ను రాజ్యాంగంలో చేర్చిన అంబేడ్కర్‌కు తెలంగాణ ఎప్పటికీ రుణపడి ఉంటుంది’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. 

భాషా ఆధిప‌త్యాన్ని, ప్రాంతీయ ఆధిప‌త్యాన్ని అంబేద్క‌ర్‌ వ్య‌తిరేకించిన‌ట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.  భార‌త ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌కు ప్ర‌తీక పార్ల‌మెంట్‌.. టెంపుల్ ఆఫ్ డెమాక్ర‌సీకి పేరు పెట్ట‌డానికి ఇంత‌కు మించిన వ్య‌క్తి లేరు.. అందుకే అంబేద్క‌ర్ పేరును పెట్టాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరుతూ కేటీఆర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 

ఇక, సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ.. మంత్రి ప్ర‌వేశ పెట్టిన‌ తీర్మానాన్ని ఏక‌గ్రీవంగా ఆమోదం తెలుప‌డానికి తాము మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు తెలిపారు. పంజాగుట్ట‌లో అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios