Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ ఎన్నికలు: మిత్రులు వీరే, కేసీఆర్ లెక్కలు ఇవీ

ప్రభుత్వ వ్యతిరేక ఓటను చీల్చే శక్తులను కేసిఆర్ బలంగానే నమ్ముకున్నారని అంటున్నారు. వాటిలో సిపిఎం నేతృత్వంలోని బిఎల్ఎఫ్ ఒకటి కాగా, బిజెపి మరోటి. మూడోది మజ్లీస్ పార్టీ కూడా. వాటికి తోడు, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ, జనసేన టీఆర్ఎస్ కు పరోక్షంగా సహకరిస్తున్నాయనే ప్రచారం ఉంది. 

Telangana assembly polls: These will help KCR
Author
Hyderabad, First Published Dec 2, 2018, 8:19 AM IST

హైదరాబాద్: నిజానికి, ముందస్తు శాసనసభ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పక్కాగానే ప్లాన్ వేశారు. సంక్షేమ పథకాలు ఓ వైపు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చే శక్తులు మరో వైపు తన పార్టీ విజయానికి దోహదపడుతాయని ఆయన భావించారు. అందుకే, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తిని ఆయన పట్టించుకోలేదు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటను చీల్చే శక్తులను కేసిఆర్ బలంగానే నమ్ముకున్నారని అంటున్నారు. వాటిలో సిపిఎం నేతృత్వంలోని బిఎల్ఎఫ్ ఒకటి కాగా, బిజెపి మరోటి. మూడోది మజ్లీస్ పార్టీ కూడా. వాటికి తోడు, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ, జనసేన టీఆర్ఎస్ కు పరోక్షంగా సహకరిస్తున్నాయనే ప్రచారం ఉంది. బహుశా, కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తును ఆయన ఊహించి ఉండరని కూడా అంటున్నారు. 

తాము బలంగా ఉన్న స్థానాల్లోనే కాకుండా అన్ని స్థానాల్లో బిఎల్ఎఫ్, బిజెపి కారుకు జోరు అందించడానికేననే అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. 

మజ్లీస్ విషయానికి వస్తే, ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ బహిరంగంగానే టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించారు. తమ పార్టీ గెలిచే బలమైన స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలిపిన మజ్లీస్ మిగతా అన్ని స్థానాల్లో బలహీనమైన అభ్యర్థులను బరిలోకి దించిందనే అభిప్రాయం ఉంది. టీఆర్ఎస్ కు అది సహకరిస్తుందనేది నిర్వివాదాంశమని అంటున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బలమైన నవీన్ యాదవ్ ను మజ్లీస్ పక్కన పెట్టడం కేసీఆర్ తో ఉన్న అవగాహనకు తార్కాణమని అంటున్నారు. 

మజ్లీస్ 2014 ఎన్నికల్లో తెలంగాణలో 20 సీట్లకు పోటీ చేసింది. ఇప్పుడు 8 సీట్లకు మాత్రమే పరిమితమైంది. టీఆర్ఎస్ తో ఉన్న అవగాహన కారణంగానే పోటీ చేసే స్థానాలను తగ్గించుకుంది. టీఆర్ఎస్ ముస్లిం ఓట్లు చీలకుండా చూసేందుకు మజ్లీస్ జిల్లాల్లో తన అభ్యర్థులను పోటీకి దించలేదు. అయితే, మజ్లీస్ పోటీ చేస్తున్న స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దీనివల్ల మజ్లీస్ కు కలిసి వస్తుందనేది అంచనా. 

సిపిఎం నేతృత్వంలో ఏర్పడిన బిఎల్ఎఫ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలుస్తుందనేది అంచనా వేశారు. గత ఎన్నికల్లో సిపిఐతో కలిసి పోటీ చేసిన సిపిఎం ఈసారి చిన్నచితకా పార్టీలతో, కొన్ని శక్తులతో కలిసి బిఎల్ఎఫ్ ను ఏర్పాటు చేసి బరిలోకి దిగింది. ఉమ్మడి గుర్తుతో ఆ శక్తులన్నీ పోటీ చేస్తున్నాయి. 

గత ఎన్నికల్లో కేవలం మూడు సీట్లకు మాత్రమే పోటీ చేసింది. కానీ ఈసారి బిఎల్ఎఫ్ అభ్యర్థులు 109 స్థానాల్లో రంగంలోకి దిగారు. దానివల్ల ఈ స్థానాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి టీఆర్ఎస్ కు లేదా బిజెపికి మేలు చేసే విధంగా వ్యవహరిస్తుందనే విమర్శలు ఉన్నాయి. 

గత ఎన్నికల్లో బిజెపి కేవలం 48 స్థానాలకు పోటీ చేసింది. ఈసారి 118 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. వాస్తవానికి బలం ఉన్న 30 స్థానాలకే పరిమితం కావాలని బిజెపి భావించింది. అయితే, తెలంగాణ ఎన్నికల్లో ఏదో విధంగా బలం నిరూపించుకుని కాస్తాకూస్తో సీట్లు దక్కించుకోవడం ద్వారా భవిష్యత్తుకు మార్గం సుగమం చేసుకోవాలనే ఆలోచన ఆ పార్టీ నేతల్లో ఉంది. తాజా రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తెలంగాణలో కిందిస్థాయి క్యాడర్ ను పెంచుకోవడానికి ఈ ఎన్నికలు ఉపయోగపడుతాయని భావిస్తోంది. అయితే, బిజెపి పోటీ వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి టీఆర్ఎస్ కు లాభం కలుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

జనసేన, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో లోలోపల టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీమాంధ్ర సెటిలర్స్ పేరుతో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కొద్ది రోజుల క్రితం కేటీఆర్ తో సమావేశమయ్యారని తెలుస్తోంది. కూకట్ పల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని జగన్ ఆదేశించినట్లు ఓ వైసిపి నేత ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. 

మరోవైపు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో కేసీఆర్ విధానాలను మెచ్చుకున్నారు. తెలంగాణలో తన పార్టీ అభ్యర్థులను పోటీకి దించకుండా పవన్ కల్యాణ్ మౌనంగా ఉండిపోయారు. తెలంగాణలోని ఎన్నికలపై తన వైఖరిని కూడా చెప్పలేదు. దీంతో జనసేన కార్యకర్తలు తమ అధినేత టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నారనే నమ్మకంతో టీఆర్ఎస్ కు సహకరిస్తున్నారనే ప్రచారం సాగుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios