తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఏడు బిల్లులను ప్రవేశపెట్టింది. 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 6వ తేదీన తెలంగాణ అసెంబ్లీ వర్షకాల సమావేశాలు ప్రారంభమై సంగతి తెలిసిందే. అయితే ఐదు రోజుల విరామం తర్వాత శాసనసభ, మండలి సమావేశాలు ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం అయ్యాయి. ఈరోజు ఉభయసభల్లోనూ ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. సభ ప్రారంభమైన తర్వాత ఇటీవల మరణించిన పాలేరు మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతిరావుకు సభ సంతాపం తెలిపింది. 

అనంతరం రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఏడు బిల్లులను ప్రవేశపెట్టింది. విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తిరస్కరించారు. అనంతరం శాసనసభలో కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు-ప్రభావాలపై స్పల్పకాలిక చర్చ సాగుతుంది. మరోవైపు శాసనమండలిలో కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు-ప్రభావాలపై లఘు చర్చ కొనసాగుతుంది. ఈ చర్చను ఎమ్మెల్సీ మధుసూదనాచారి ప్రారంభించారు. 

-జీఎస్టీ సవరణ బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సభలో ప్రవేశపెట్టారు. 
-అజామాబాద్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా చట్ట సవరణ బిల్లును మంత్రి కేటీఆర్‌ సభలో ప్రవేశపెట్టారు. 
-తెలంగాణ మున్సిపల్ చట్టాల సవరణ బిల్లును మంత్రి కేటీఆర్ సభలో ప్రవేశపెట్టారు. 
- తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ చట్ట సవరణ బిల్లను మంత్రి హరీష్ రావు సభలో ప్రవేశపెట్టారు. 
-తెలంగాణ మోటారు వాహనాల పన్నుచట్ట సవరణ బిల్లును మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సభలో ప్రవేశపెట్టారు. 
-యూనివర్సిటీల ఉమ్మడి నియామక బోర్డు బిల్లును మంత్రి సబితా ఇంద్రారెడ్డి సభలో ప్రవేశపెట్టారు
-అటవీ వర్సిటీ బిల్లును మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు.