Asianet News TeluguAsianet News Telugu

వరంగల్‌ వెస్ట్‌లో వరద బాధితులు బీఆర్ఎస్‌కు షాకిస్తారా .. కాంగ్రెస్, బీజేపీల ధీమా ఏంటీ..?

హనుమకొండ, కాజీపేట, వరంగల్‌‌ నగరంలో విస్తరించి వున్న వరంగల్ వెస్ట్‌లో హేమాహేమీలు బరిలో వుండటంతో టఫ్ ఫైట్ తప్పదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వరంగల్ వెస్ట్‌లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్.. కాంగ్రెస్ అభ్యర్ధి నాయిని రాజేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్ధి రావు పద్మల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. 

telangana assembly elections : Triangular Contest in Warangal West, brs dasyam vinay bhaskar Confident ksp
Author
First Published Nov 7, 2023, 4:43 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ అభ్యర్ధులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అన్ని పార్టీలకు చెందిన అగ్రనేతలు వాడి వేడి విమర్శలతో ప్రత్యర్ధులపై విరుచుకుపడుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు జరగనుంది. దాదాపు 80 నుంచి 90 స్థానాల్లో ఈ రెండు పార్టీల మధ్య భీకర పోరు ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. హనుమకొండ, కాజీపేట, వరంగల్‌‌ నగరంలో విస్తరించి వున్న వరంగల్ వెస్ట్‌లో హేమాహేమీలు బరిలో వుండటంతో టఫ్ ఫైట్ తప్పదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వరంగల్ వెస్ట్‌లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్.. కాంగ్రెస్ అభ్యర్ధి నాయిని రాజేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్ధి రావు పద్మల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. 

2018 అసెంబ్లీ ఎన్నికల్లో వినయ్ భాస్కర్ 36,451 ఓట్ల మెజారిటీతో.. అప్పటి కాంగ్రెస్ - టీడీపీ కూటమి అభ్యర్ధి రేవూరి ప్రకాశ్ రెడ్డిపై విజయం సాధించారు. ఈ సారి ఎన్నికలకు సంబంధించి సీఎం కేసీఆర్ అభ్యర్ధుల జాబితాను ప్రకటించిన వెంటనే వినయ్ భాస్కర్ ఇంటింటి ప్రచారంలోకి దిగారు. నాలుగు సార్లు ఎమ్మెల్యే కావడంతో నియోజకవర్గంలోని అన్ని వర్గాలతో వినయ్ భాస్కర్‌కు వ్యక్తిగత సాన్నిహిత్యం వుంది. ఇది ఆయనకు బాగా కలిసొస్తుందని విశ్లేషకుల అంచనా. ఓ జాతీయ మీడియా సంస్థతో దాస్యం వినయ్ భాస్కర్ మట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నియోజకవర్గం అభివృద్ధి తనను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విపక్ష పార్టీ నేతలను నమ్మడానికి ఓటర్లు సిద్ధంగా లేరని వినయ్ భాస్కర్ అన్నారు. 

కాంగ్రెస్ అభ్యర్ధి నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వైఫల్యాలు, రాష్ట్రంలో కుటుంబ పాలనను హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇటీవల వరదల వల్ల ప్రభావితమైన ప్రాంతాలను పట్టించుకోవడం లేదని నాయిని ఆరోపించారు. అటు బీజేపీ అభ్యర్ధి రావు పద్మ విషయానికి వస్తే.. కేంద్ర ప్రభుత్వ విధానాలు, స్మార్ట్ సిటీ మిషన్, అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్) వంటి కార్యక్రమాల నుంచి వరంగల్‌కు కేటాయించిన నిధులపై తాను దృష్టి సారించినట్లు చెప్పారు. నిధుల దుర్వినియోగం, అసంపూర్తిగా వున్న డబుల్ బెడ్‌రూం ఇళ్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం కారణమని రావు పద్మ ఆరోపించారు. హనుమకొండ నగరంలో వరదల నిర్వహణ, పెండింగ్‌లో వున్న ప్రాజెక్ట్‌లపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 

వరంగల్‌ను స్మార్ట్ సిటీగా మారుస్తామని బీఆర్‌ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో అనేక ప్రాంతాలు వర్షాల సమయంలో ముంపునకు గురవుతున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ)లో ప్రస్తుతం ఉన్న డ్రైనేజీ వ్యవస్థ శిథిలావస్థకు చేరుకుంది. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరం వరంగల్. అయితే అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థపై ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు. నియోజకవర్గంలోని వరంగల్‌, హన్మకొండ, కాజీపేట ట్రైసిటీల్లో ఓపెన్‌ డ్రైన్‌లు దోమలకు నిలయంగా మారి దుర్వాసన వెదజల్లుతున్నాయి. డిగ్నిటీ హౌసింగ్‌ పథకం కింద ఒక్క డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు కూడా ఈ సెగ్మెంట్‌లో కేటాయించలేదని విపక్షాలు మండిపడుతున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios