ఎన్నికలంటే ఆషామాషీ వ్యవహారం కాదు.. ఎత్తులు, పైఎత్తులు వేయాలి.. మిగిలిన అభ్యర్థుల కంటే వేగంగా ఆలోచించాలి, జనం నాడిని పసిగట్టాలి అప్పుడే విజయం సాధ్యపడుతుంది. మన ఇంట్లో ఏం జరిగినా సరే.. ముందు పక్కింట్లో ఏం జరుతుందో తెలుసుకోవాలన్నది ప్రతి భారతీయుడి ఆలోచన..

ఇప్పుడు ఇదే సూత్రాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఎమ్మెల్యే అభ్యర్థులు ఫాలో అవుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో.. అన్ని పార్టీలు ప్రచారంలో హోరాహోరీగా దూసుకెళ్తున్నాయి.

క్యాంపెయినింగ్‌లో మునిగి తేలుతూనే పక్క పార్టీల ఎత్తుల్ని ముందుగా తెలుసుకునేందుకు అన్ని పార్టీలు ప్రాధాన్యమిస్తున్నాయి.. వారిపై నిఘా పెట్టేందుకు వీలుగా గూఢచారులను నియమిస్తున్నాయి. వీరు ఎవరో కాదు పార్టీలోని నమ్మకస్తులు. 

ప్రచారం వారు ఎలాంటి ఎత్తుగడలు వేస్తున్నారు..? ఎవరెవరిని కలుస్తున్నారు..? ఏ ఏ గ్రామాల్లో తిరుగుతున్నారనే విలువైన సమాచారాన్ని సేకరించడం వీరి బాధ్యత. ఇందుకోసం ప్రత్యర్థి పక్షంలోని కొందరితో దోస్తీ చేయడంతో పాటు ఇతర మార్గాల్లో ప్రలోభపెట్టి తమకు కావాలసిన సమాచారాన్ని కూపీ లాగుతున్నారు.

ఇలా వచ్చిన సమాచారాన్ని వడపోసి నియోజకవర్గాల్లోని అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారాన్ని చేస్తున్నారు. తటస్థంగా ఉన్న ఓట్లను తమకు అనుకూలంగా మలుచుకోవడంతో పాటు కులసంఘాల ఓట్లకు గాలం వేయడంతో పాటు మహిళలు, యువతను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీలు ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి.

ఎదుటి పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న నేతలు, కార్యకర్తల సమాచారాన్ని తెలుసుకుని వారిని ఎలాగోలా బుజ్జగించి తమ వెంట నడిచేలా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విధానం సక్సెస్ అయితే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇదే విధానాన్ని అమలు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.