హైదరాబాద్: శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వ్యూహాన్ని అనుసరించబోతున్నారు. ప్రభుత్వ పథకాల వల్ల ప్రయోజనం పొందుతున్నవారి చేత పక్కాగా ఓటు వేయించుకునే వ్యూహాన్ని అనుసరించాలని కేసీఆర్ పార్టీ అభ్యర్థులకు సూచించినట్లు తెలుస్తోంది. 

అందుకుగాను కేసీఆర్ పార్టీ అభ్యర్థులకు నియోజకవర్గాలవారీగా, పథకాలవారీగా లబ్ధిదారుల జాబితాలను అందజేశారు. లబ్ధిదారులు పక్కాగా ఓటు వేస్తే తమ పార్టీ విజయం తథ్యమని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. పోలింగు రోజు మొదటి గంటలో వృద్ధాప్య పింఛన్ల లబ్ధిదారుల చేత, దివ్యాంగుల చేత ఓటు వేయించే వ్యూహాన్ని అనుసరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

రైతులంతా తమ వైపే ఉంటారని టీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు. లక్ష రూపాయల మేర రుణమాఫీ చేయడం వల్ల, రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి 8 వేల రూపాయలేసి పెట్టుబడి సబ్సిడీ ఇవ్వడం వల్ల రైతులు తమ వైపే ఉంటారని అనుకుంటున్నారు. కేసీఆర్ ఈ పథకంపై పెద్ద ఆశలే పెట్టుకున్నారు. 

గత నాలుగున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా 2 లక్షల కోట్ల రూపాయలను వివిధ వర్గాలకు అందించింది. ఈ స్థితిలో తటస్థ ఓటర్లపై, ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్న ఓటర్లపై దృష్టి పెట్టి వారిని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించాలని టీఆర్ఎస్ నాయకత్వం అభ్యర్థులకు సూచించింది. 

మితి మీరిన విశ్వాసం కూడదని, ప్రతి ఓటూ విలువైందేనని టీఆర్ఎస్ నాయకత్వం అభ్యర్థులకు సూచించింది. ప్రచారంలో ప్రతి ఓటరును నేరుగా కలుసుకోవాలని కూడా చెప్పింది. 

ప్రధాన ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు

వృద్ధాప్య పింఛన్ల లబ్ధిదారులు 13,36,918
పింఛన్లు పొందుతున్న దివ్యాంగులు 4,96,215
విడో పెన్షన్లు పొందుతున్నవారు 14,40,367
ఆసరా కింద పింఛన్లు పొందుతున్న బీడీ కార్మికులు 4,08,635
ఆరోగ్య లక్ష్మి కింద ప్రయోజనం పొందినవారు 18,05,634
కల్యాణ లక్ష్మి ద్వారా ప్రయోజనం పొందుతున్నవారు 3,43,059
రైతు భీమా లబ్దిదారులు 28 వేల మంది
రైతు బంధు లబ్దిదారులు 49,49,000
కేసీఆర్ కిట్స్ లబ్ధిదారులు 3,18,742