హైదరాబాద్: ఏ పని చేపట్టినా..ఏ కార్యక్రమం చేపట్టినా అమావాస్య అంటేనే వద్దు వద్దు అంటారు. ఏ వస్తువు కొనాలన్నా...అమ్మాలన్నా..ఆఖరికి బంధువులు ఇంటికి వెళ్లాలన్నా అమావాస్య రోజు ఏం వెళ్తావులే అంటూ ఆపేస్తారు. అంతేకాదు అమావాస్య ముందు కూడా ఏపని చేపట్టనివ్వరు. 

అమావాస్య ఎదురు పెట్టుకుని ఇప్పుడెందుకు అమావాస్య పోనియ్ అంటుంటారు పెద్దలు. అలా కొందరికి అమావాస్య పెద్ద సెంటిమెంట్ గా మారిపోయింది సమాజంలో. అయితే అదే అమావాస్య రోజు ఎందరో భవిష్యత్ ను రాయనుంది. 
 
ఈనెల 7 అంటే శుక్రవారం గుర్తుందిగా తెలంగాణ ఎన్నికల రోజు. ఆరోజు అమావాస్య. అమావాస్య రోజున పోలింగ్ కావడంతో సెంటిమెంట్ ఉన్న అభ్యర్థులు నానా హైరానా పడుతున్నారట. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ వేసేముందు ముహూర్తం పెట్టించుకోవడం, ముహూర్తం చూసి ప్రచారం మెుదలుపెట్టడం చేశారు అభ్యర్థులు. 

ఆలయంలో ప్రత్యేక పూజలు చెయ్యడం, దేవదేవుళ్ల ఆశీస్సులతో ప్రచారం నిర్వహించడం అంతా జరిగిపోయింది. ఆ తర్వాత ఓటర్లకు వాళ్లు చూపించిన చుక్కలు అన్నీ ఇన్నీకావు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఒక్కో నాయుకుడు ఒక్కో వేషాలు. ఐరన్ చేసేవారు ఒకరు. టీ పెట్టేవారు మరోకరు. 

రోడ్లు ఊడ్చేది మరోకరు ఇలా ఏవేవో ఓట్లు కోసం నానా పాట్లు పడ్డారు. మెుత్తానికి ఆ ముచ్చటకు తెరపడిపోయింది కూడా. ఇక తీర్పునియ్యాల్సింది ఓటరు. ఆ ఓటరు ఓటు హక్కు వినియోగించేది అమావాస్య రోజున. 

అమావాస్య రోజున ఓటరన్న ఎవరికి ఓటేస్తాడా అంటూ అభ్యర్థులు ఆలోచిస్తున్నారట. అమావాస్య రోజున విజయలక్ష్మీ ఎవరిని వరిస్తుందా అంటూ ఇప్పటికే చాలా మంది అంచనాలు వేసుకుంటున్నారట. అమావాస్య సెంటిమెంట్ ఉన్నోళ్లు మాత్రం టెన్షన్ పడుతున్నారట.

అయితే అమావాస్య రోజు కూడా చాలా మంచిదేనని కొందరి నమ్మకం. అమావాస్యకు ముందు వెనుక మంచిది కాకపోవచ్చు కానీ ఆరోజు మాత్రం మంచిదేనని చెప్తుంటారు. ఆరోజు మరి ఓటరన్న ఎవరికి ఓటేస్తాడో ఎవరిని గద్దెనెక్కిస్తాడో అన్నది తెలియాలంటే డిసెంబర్ 11 వరకు వేచి చూడాల్సిందే. సో అమావాస్య పోలింగ్ ఎవరికి చీకటి మిగిలుస్తుందో ఎవరిని జీవితాల్లో వెలుగులు నింపుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.