హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు మధ్య పోరుగా మారాయా అనే ప్రశ్న ఉదయిస్తోంది. పరిస్థితి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. కాంగ్రెసుతో తెలుగుదేశం పార్టీ జత కట్టిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. కాంగ్రెసుకు కూడా చంద్రబాబే దిశానిర్దేశం చేస్తున్నారనే దాకా టీఆర్ఎస్ విమర్శలు వెళ్తున్నాయి.

కేసిఆర్ వ్యతిరేక కూటమికి చంద్రబాబు వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ప్రజా కూటమిలో కాంగ్రెసు అతి పెద్ద పార్టీ అయినప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల్లో కీలకమైన పాత్ర పోషిస్తున్నారని అంటున్నారు. టీఆర్ఎస్ నేతలు చంద్రబాబుపైనే ప్రధానంగా విమర్శలు చేయడం కూడా ఆ అభిప్రాయాన్ని బలపరుస్తోంది.

తొలుత మూడు బహిరంగ సభల్లో పాల్గొన్న కేసీఆర్ ఇప్పటి వరకు తెర వెనకనే ఉండిపోయారు. ఆయన తనయుడు కేటీ రామారావు అంతా తానై ప్రచారాన్ని ముందుకు నడిపిస్తున్నారు. హరీష్ రావు సిద్ధిపేట, గజ్వెల్ నియోజకవర్గాలకు పరిమితమైనట్లు కనిపిస్తున్నారు. నల్లగొండ బహిరంగ సభలో కేసిఆర్ చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసును కూడా ప్రస్తావించారు. 

ప్రస్తుతం కేటీఆర్, హరీష్ రావులు చంద్రబాబుపైనే ప్రధానంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కాంగ్రెసుతో టీడీపి పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఓ వర్గం ఓట్లు జారిపోతాయనే గుబులు టీఆర్ఎస్ లో కనిపిస్తోంది. తెలంగాణలోని ఆంధ్ర ఓటర్లు, ముఖ్యంగా ఓ సామాజిక వర్గం ఓటర్లు ప్రజా కూటమి వైపు మళ్లే అవకాశం ఉందనే అభిప్రాయం ఆ గుబులుకు కారణంగా చెబుతున్నారు. 

మరోవైపు, సీట్ల పంపకంలో తెలుగుదేశం పార్టీ మొండి పట్టు లేకుండా జాగ్రత్త పడింది. తమకు బలం ఉందని భావించిన, ముఖ్యంగా తాము గెలుస్తామని భావిస్తున్న సీట్లను మాత్రమే తీసుకోవడానికి సిద్ధపడింది. దానివల్ల కాంగ్రెసులో విభేదాలకు చాలా వరకు తెరపడే అవకాశం ఉంది. కేసిఆర్ ను ఓడించడానికి త్యాగాలకు సిద్ధపడాలని చంద్రబాబు తమ పార్టీ తెలంగాణ నాయకులకు నోరిపోశారు. అది బాగానే పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. 

కేటీఆర్ హైదరాబాదులోని సీమాంధ్ర ఓటర్లను బుజ్జగించే రీతిలో మాట్లాడుతూ ఇతర ప్రాంతాల్లో చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. హరీష్ రావు ఏకంగా చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ప్రజా కూటమి విజయం సాధిస్తే మళ్లీ ఆంధ్ర పెత్తనం పెరుగుతుందనే సంకేతాలను హరీష్ రావు, కేటీఆర్ తెలంగాణ ఓటర్లకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. అ రకంగా తెలంగాణ శాసనసభ ఎన్నికలు చంద్రబాబుకు, కేసిఆర్ కు మధ్య పోరుగా పరిణమించాయని చెప్పవచ్చు.