60 ఏండ్ల గోసకు కాంగ్రెస్సే కారణం.. జడ్చర్లను ఐటీ హబ్ గా అభివృద్ధి చేస్తాం.. : కేసీఆర్
Jadcherla: "మహబూబ్ నగర్ దరిద్రం పోవాలంటే మీరు కచ్చితంగా అక్కడ నుంచి ఎంపీగా పోటీ చేయాలే.. ప్రజలు మిమ్మల్లి ఓడగొట్టరు.. మీకు మద్దతు ఇచ్చి గెలిపించుకుంటారు.. అప్పుడైతే మీకు అనుభవం వస్తదనీ" ప్రొఫెసర్ జైశంకర్ సర్ తనతో చెప్పారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఇదే జిల్లా నుంచి పోటీ చేశాననీ, ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని పేర్కొన్నారు.
Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023 ప్రచారంలో భాగంగా జడ్చర్లలో ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రజా ఆశీర్వాద సభలో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాటి పాలమూరు ప్రాంత దారుణ పరిస్థితులకు బీజేపీ, కాంగ్రెస్ లే కారణమంటూ విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో మహబూబ్‌నగర్‌తో తనకున్న అనుంబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ప్రొఫెసర్ జైశంకర్ సర్, తాను ఈ ప్రాంతంలో చాలా సార్లు పర్యటించామనీ, ఇక్కడి పరిస్థితులపై అధ్యయనం చేశామని చెప్పారు.
"మహబూబ్ నగర్ దరిద్రం పోవాలంటే మీరు కచ్చితంగా అక్కడ నుంచి ఎంపీగా పోటీ చేయాలే.. ప్రజలు మిమ్మల్లి ఓడగొట్టరు.. మీకు మద్దతు ఇచ్చి గెలిపించుకుంటారు.. అప్పుడైతే మీకు అనుభవం వస్తదనీ" ప్రొఫెసర్ జైశంకర్ సర్ తనతో చెప్పారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఇదే జిల్లా నుంచి పోటీ చేశాననీ, ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని పేర్కొన్నారు. తాను పోటీ చేస్తున్న సమయంలో లక్ష్మారెడ్డి ముందుండడి అన్ని విషయాలను చూసుకున్నారనీ, అన్ని బాధ్యతలను తన భూజాలపై వేసుకుని తనను ఎంపీగా గెలిపించారని గుర్తుచేశారు.
మహబూబ్ నగర్ ది ఒక్క గోస కాదనీ, అనేక సందర్భాల్లో కండ్లల్లో నీళ్లు వచ్చాయని కేసీఆర్ పేర్కొన్నారు. "మహబూబ్ నగర్ జిల్లాలో మార్పు రావాలనే నాడు ఎంపీగా పోటీ చేశా.. మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. ఈ జిల్లా నా గుండెల్లో ఉంటుంది, పాలమూరు పాలుకారే జిల్లాగా మారుతుంది. పరిశ్రమల కేంద్రంగా జడ్చర్లను తీర్చిదిద్దుతా, ఇకపై ఇక్కడ కరువు అనే మాట ఉండదని" తెలిపారు. ఈ ప్రాంతాల్లో అంబలి కేంద్రాలు, గజ్జి కేంద్రాలు పెడుతుంటే ఎంతో బాధ కలిగేదనీ, కృష్ణానది పక్కనే ఉన్నా.. అభివృద్ధికి అన్ని అవకాశాలు ఉన్నా ఏం దుర్ఘతని మనస్సుల్లో బాధపడ్డామని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రులు, మంత్రులు రావడం, దత్తత తీసుకోవడం, శిళాఫలకలు వేయడం తప్ప ఏమీ లాభం జరగలేదని అనాటి ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమి లేకపోయే.. అంటూ తాను రాసిన పాటను కేసీఆర్ గుర్తు చేశారు. ఎంతో పోరాటం చేసిన తర్వాత తెలంగాణను సాధించుకున్నామనీ, కాంగ్రెస్ చేసిన పొరపాటు వల్ల 60 సంవత్సరాలు గోసపడ్డామని విమర్శించారు. తెలంగాణను ఎవరూ ఇవ్వలేదనీ, ఎంతో మంది ప్రాణాలు త్యాగాలు, పోరాటంతో రాష్ట్రాన్ని సాధించుకున్నామని కేసీఆర్ అన్నారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, ఉద్దండాపూర్ రిజర్వాయర్లు, టన్నెల్స్ పూర్తయ్యాయనీ, ఈ ప్రాంతం కరువు పోతుందని తెలిపారు. హైదరాబాద్ కు సమీప ప్రాంతమనీ, ఇక్కడ ఐటీ పరిశ్రమను అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు.