సారాంశం

Bodhan: నిజామాబాద్‌లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ శ్రేణుల ఘ‌ర్ష‌ణ క్ర‌మంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మహ్మద్ అమీర్ షకీల్ కు స్వ‌ల్ప గాయాలు అయ్యాయి. బీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
 

Telangana Elections 2023: నిజామాబాద్‌లోని బోధన్‌లో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్), కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం హింసకు పాల్పడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో రాష్ట్రంలోని అన్ని రాజ‌కీయ పార్టీలు ముమ్మ‌రంగా ఎన్నిక‌ల ప్ర‌చారం కొన‌సాగిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే వివిధ పార్టీల నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దం అవుతున్నాయి. నాయ‌కుల‌కు మేము త‌క్కువేమీ కాదంటూ ప‌లు చోట్ల ప‌లు పార్టీల కార్యక‌ర్త‌లు ఇత‌ర పార్టీల ప్ర‌చారాల‌ను అడ్డుకోవ‌డం, ప్ర‌చారానికి వ‌స్తున్న వారిని ప్ర‌జ‌లు ప్ర‌శ్నించ‌డంతో ఉద్రిక్త ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయి.

ఈ క్ర‌మంలోనే నిజ‌మాబాద్ లో ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా కాంగ్రెస్, అధికార పార్టీ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య స్వ‌ల్ప ఘ‌ర్ష‌ణ చోటుచేసుకుంది. ఈ క్ర‌మంలోనే పలువురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘర్షణలో బోధన్ సిట్టింగ్ ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయ‌కుడు మహ్మద్ అమీర్ షకీల్ కూడా గాయపడినట్లు సమాచారం. విష‌యం తెలిసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు. నియోజకవర్గంలో షకీల్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

ఈ పరిణామంపై స్పందించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హింసను ఖండించారు. ఈ పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కార‌ణ‌మంటూ ఆరోపించారు. 'బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే, బోధన్‌ అభ్యర్థి షకీల్‌, కార్యకర్తలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఓటమి భయంతో కాంగ్రెస్ చేస్తున్న ఈ భౌతిక దాడులు కాంగ్రెస్ న‌డుచుకుంటున్న‌ తీరుకు, గుండాయిజానికి నిదర్శనంగా కవిత పేర్కొన్నారు.