నాగార్జునసాగర్ అసెంబ్లీ సీటు నుంచి అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ మామకు సహాయసహకారాలు అందిస్టున్నట్లు సమాచారం.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వచ్చే శాసనసభ ఎన్నికల అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నారు. తొలి విడత జాబితాను కేసీఆర్ ఈ నెల 21వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆ జాబితాలో నాగార్జనసాగర్ అసెంబ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్ పేరు లేదని తెలుస్తోంది. నాగార్జునసాగర్ అభ్యర్థిని మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో నాగార్జునసాగర్ నుంచి పోటీ చేయాలని హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి భావిస్తున్నారు.
మామకు బిఆర్ఎస్ టికెట్ సాధించడానికి అల్లు అర్జున్ తెర వెనక ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డిపై బిఆర్ఎస్ (అప్పటి టిఆర్ఎస్) తరఫున పోటీ చేసిన నోముల నర్సింహయ్య విజయం సాధించారు. ఆయన మరణంతో నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఉప ఎన్నికలో అప్పటి టిఆర్ఎస్ తరఫున నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఈసారి నోముల భగత్ ను పక్కన పెట్టే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.
దాంతో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి బిఆర్ఎస్ టికెట్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. కేసిఆర్ ఫౌండేషన్ పేరున ఓ సంస్థను స్థాపించి ఆయన సామాజిక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తన గ్రామంలో ఓ కన్వెన్షన్ సెంటర్ కూడా స్థాపించారు. దాని ప్రారంభోత్సవం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ హాజరయ్యారు. కంచర్ల చంద్రశేఖర రెడ్డికి టికెట్ దక్కేలా చేసి ఆయనను గెలిపించడానికి అల్లు అర్జున్ రంగంలోకి దిగుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే అల్లు అర్జున్ కన్వెన్షన్ సెంటర్ ప్రారంభోత్సవానికి హాజరైనట్లు చెబుతున్నారు.,
ఒక రకంగా చంద్రశేఖర్ రెడ్డి తన బలప్రదర్శనకు ఆ కార్యక్రమాన్ని వాడుకున్నట్లు తెలుస్తోంది. తన బలంపై పార్టీ అగ్ర నాయకత్వానికి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి సంకేతాలు పంపినట్లు కూడా భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున జానారెడ్డి పోటీ చేసే అవకాశాలే ఎక్కవగా ఉన్నాయి. అయినప్పటికీ జానారెడ్డిని తాను ఓడించగలననే ధీమాను కంచర్ల చంద్రశేఖర రెడ్డి వ్యక్తం చేస్తున్నారు.
కన్వెన్షన్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అల్లు అర్జున్ పొగడ్తలతో ముంచెత్తారు. అల్లు అర్జున్ చంద్రశేఖరరెడ్డి కూతురు స్నేహారెడ్డిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పుష్ఫ 2 షూటింగులో బిజీగా ఉన్నప్పటికీ అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కంచర్ల చంద్రశేఖర రెడ్డి కూడా చాలా కాలంగా స్థానికంగా బలం పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
