Asianet News TeluguAsianet News Telugu

100 సీట్లు కేసిఆర్ మైండ్ గేమే: అంత సీన్ ఉందా...

తెలుగుదేశం, కాంగ్రెసు, ఇతర పార్టీలతో ఏర్పడిన ప్రజా కూటమిని ఎదుర్కోవడం కూడా టీఆర్ఎస్ కు అంత సులభం కాదనే మాట వినిపిస్తోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్తూ కేసిఆర్ ప్రకటన చేసినప్పుడు ఉన్న రాజకీయ వాతావరణం కూడా ఇప్పుడు లేదు.

Telangana Assembly elections 2018: Not easy for TRS to hit 100-plus seats
Author
Hyderabad, First Published Nov 7, 2018, 10:51 AM IST

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తాము వందకు పైగా సీట్లు గెలుచుకుంటామని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు ధీమాగా చెబుతున్నారు. ఆయన తనయుడు కేటీ రామారావు కూడా అదే మాట అంటున్నారు. అయితే టీఆర్ఎస్ అన్ని సీట్లు సాధించడం సాధ్యమేనా అన్నది ప్రశ్న. అంత సీన్ లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. 

తెలుగుదేశం, కాంగ్రెసు, ఇతర పార్టీలతో ఏర్పడిన ప్రజా కూటమిని ఎదుర్కోవడం కూడా టీఆర్ఎస్ కు అంత సులభం కాదనే మాట వినిపిస్తోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్తూ కేసిఆర్ ప్రకటన చేసినప్పుడు ఉన్న రాజకీయ వాతావరణం కూడా ఇప్పుడు లేదు.

టీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలు కూటమి కట్టడం, వివిధ వర్గాల్లో ఉన్న అసంతృప్తి బహిరంగంగా వ్యక్తం కావడం వంటి విషయాలతో పరిస్థితి మారినట్లు కనిపిస్తోంది. దానికితోడు, కొంత మంది సిట్టింగులపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కూడా బాహాటంగా వ్యక్తమవుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను అడ్డుకోవడం కూడా కనిపిస్తోంది. గజ్వెల్ లోనే కేసిఆర్ తీవ్రమైన పోటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో పడ్డారు. 

శాసనసభ మొత్తం స్థానాలు 119 కాగా గత 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ 63 సీట్లు గెలుచుకుంది. అంటే బొటాబొటీ మెజారిటీ సాధించింది. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో టీఆర్ఎస్ స్వీప్ చేసింది. నల్లగొండ, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 9 సీట్లు టిఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి. కరీంనగర్ జిల్లాలోని 13 స్థానాల్లో 12 సీట్లను గెలుచుకుంది. వరంగల్ జిల్లాలోని 12 సీట్లలో 8 సీట్లను గెలుచుకుంది. మెదక్ జిల్లాలోని 12 సీట్లలో 8 సీట్లను సాధించింది. హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లోని 29 సీట్లలో టీఆర్ఎస్ కేవలం ఐదు సీట్లు గెలుచుకుంది. 

వంద సీట్లను దాటాలంటే సిట్టింగ్ సీట్లను అన్నింటినీ గెలుచుకోవడంతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పరిస్థితిని టీఆర్ఎస్ మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. అది అంత సులభమైన విషయమేమీ కాదు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని బలపరిచిన అన్ని సామాజిక వర్గాలు 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ వైపు ఉన్నాయి. దాంతో టీఆర్ఎస్ గాలి వీచింది. అయినప్పటికీ 63 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. ప్రస్తుతం పలు సామాజిక వర్గాలు టీఆర్ఎస్ కు దూరమయ్యాయి. పలువురు అభ్యర్థులు వ్యతిరేకతను ఎదుర్కుంటున్నారు. ఈ స్థితిలో టీఆర్ఎస్ 63 సీట్లను తిరిగి గెలుచుకోవడం కూడా కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

ఇతర పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలను కేసిఆర్ టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. తిరిగి వారు తమ సీట్లను నిలబెట్టుకుంటారనే నమ్మకం బహుశా కేసిఆర్ కు ఉండి ఉంటుంది. టీఆర్ఎస్ మరో వాదన కూడా చేస్తోంది. 2014 ఎన్నికల్లో తమ పార్టీకి క్యాడర్ లేదని, ఇప్పుడు పార్టీ క్యాడర్ ఉందని, దానికి తోడు 2 లక్షల కోట్ల విలువ చేసే సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని, ఇవే తమ విజయానికి దోహదం చేస్తాయని టీఆర్ఎస్ నాయకులు ్ంటున్నారు. 

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ స్వీప్ చేసింది. ఆ ఫలితాలే శాసనసభ ఎన్నికల్లోనూ ప్రతిఫలిస్తాయనే విశ్వాసం బహుశా కేసీఆర్ కు ఉండవచ్చు. హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లోని 29 సీట్లలో పాతబస్తీలోని 7 సీట్లు మజ్లీస్ కు వెళ్తాయని కేసిఆర్ స్వయంగా చెబుతున్నారు మిగతా 22 స్థానాల్లో ప్రజా కూటమి నేతలతో టీఆర్ఎస్ అభ్యర్థులు తలపడాల్సి ఉంటుంది. తెలుగుదేశం, కాంగ్రెస్ ఒక్కటైన స్థితిలో ఆంధ్ర ఓటర్లు ఎటు వైపు మొగ్గుతారనేది కూడా చూడాల్సి ఉంటుంది. 

2014లో జిల్లాలవారీగా టీఆర్ఎస్ విజయం సాధించిన స్థానాలు

నిజామాబాద్ (9) 9
కరీంనగర్ (13) 12
మెదక్ (10) 8
వరంగల్ (12) 8
ఆదిలాబాద్ (10) 7
నల్లగొండ (12) 6
మహబూబ్ నగర్ (14) 7
రంగారెడ్డి (14) 4
హైదరాబాద్ (15) 1
ఖమ్మం (10) 1

Follow Us:
Download App:
  • android
  • ios