నిజాయితీ గల రాజకీయ నాయకుడు గుమ్మడి నర్సయ్య కూతురు డా. గుమ్మడి అనూరాధ బీఆర్ఎస్ నుంచి పోటీ చేయనున్నారని ఊహాగానాలు వెలువడుతున్నాయి.  

హైదరాబాద్ : రాజకీయాల్లోకి రావడం అంటే కోట్లు కూడా బెట్టడమే. ఒక్కసారి కనక ఎంపీనో, ఎమ్మెల్యేనో అయ్యారంటే.. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ధనవంతుల జాబితాలో చేరిపోతారు. దీనికి భిన్నంగా ఓ వ్యక్తి మాత్రం ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ప్రజాసేవ ధ్యేయంగా బతికాడు. చిల్లిగవ్వ సంపాదించుకోలేదు. నేటికీ విప్లవోద్యమ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ, వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. ప్రజలకు తలలో నాలుకల మెదులుతున్నారు.

ఆయన ఎవరో ఇప్పటికే మీకు అర్థం అయిపోయి ఉంటుంది. ఖమ్మం జిల్లా ఇల్లెందు నియోజకవర్గ నుంచి ఎనిమిది సార్లు పోటీ చేసి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నరసయ్య. నేటికీ విప్లవోద్యమ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు ఆయన 1983, 1985, 1999, 2004లో ఖమ్మం జిల్లా ఇల్లెందు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

హైదరాబాద్ లో బెగ్గింగ్ రాకెట్, 29మంది యాచకులు అరెస్ట్... వృద్ధులకు రోజుకు 200 కూలీ…

కానీ తన పదవీకాలం అంతా ప్రజల మధ్య గుమ్మడి నరసయ్య గడిపారు. ఎలాంటి హంగూ, ఆర్భాటాల జోలికి ఆయన వెళ్లలేదు. ఇప్పటికీ ఆయనను చూసినవారు.. ఆయన గురించి తెలిస్తే తప్ప ఎమ్మెల్యేగా గెలిచారంటే నమ్మరు. అంతటి సామాన్య జీవితం గడుపుతున్నారాయన. 1980లో నుంచి ఇప్పటివరకు ఆయన పేరు మీద ఓ పొలం తప్ప మరేమీ లేదు.

ఆదర్శవంతమైన సినిమాల్లో తప్ప ఇలాంటి వ్యక్తి నిజ జీవితంలో కనిపించడం చాలా అరుదు. ఇప్పుడు గుమ్మడి నరసయ్య గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. ప్రస్తుతం వారి కుటుంబం తెలంగాణలో మళ్లీ వార్తల్లోకి వచ్చింది. జనాల కోసం నడిచే నిజమైన నాయకుడు గుమ్మడి నరసయ్య.

ఓటమి చూస్తే నేతలు పార్టీలు మారుతున్న కాలమిది. కానీ, నరసయ్య మాత్రం మొదటినుంచి ఒకే పార్టీ, ఒకే జెండా నీడలో ఉన్నారు. పాతికేళ్లు ఎమ్మెల్యేగా చేసినా కూడా ఏనాడు అవినీతికి పాల్పడలేదు. అలాంటి గుమ్మడి నరసయ్య కుటుంబం నుంచి ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లోకి ఒకరు వస్తున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గుమ్మడి నరసయ్య కుమార్తె డాక్టర్ గుమ్మడి అనురాధ ఇల్లందు నియోజక వర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ మేరకు ఇల్లందు నియోజకవర్గంలోని బయ్యారం, ఇల్లందు మండలంలో భారీగా అనురాధ ఫ్లెక్సీలు వెలిశాయి. గుమ్మడి అనురాధ బీఆర్ఎస్ నుంచి పోటీలోకి దిగుతారని కొందరు.. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారని మరికొందరు…ప్రచారం చేస్తున్నారు. ఇందులో నిజం ఎంత అంటే.. రెండు పార్టీలకు చెందిన వారు కూడా గుమ్మడి నరసయ్య కుటుంబాన్ని సంప్రదించినట్లుగా సమాచారం.

గతంలో ఇలాంటి వార్తలు వస్తే కొట్టిపారేసినా.. ప్రస్తుతం మాత్రం.. ఇది కొట్టేయడం లేదు. దీంతో స్థానిక యువత పెద్దఎత్తున అనురాధ బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిల్లో.. ‘ ఇల్లందు నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని కోరుకుంటున్నారు అక్క’ అని కొన్ని ఫ్లెక్సీలో ఉండడంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.

గుమ్మడి అనురాధ ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ పీజీ లా కాలేజీలో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు. .ఓయూ చరిత్రలోనే ఆదివాసి మహిళా ప్రొఫెసర్ ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టడం తొలిసారి. ప్రస్తుతం ఆమె బషీర్బాగ్ లోని పీజీ లా కాలేజ్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోనే గుమ్మడి అనురాధ పీజీ, లా కోర్సులు చదువుకున్నారు. ఆ తరువాత ఓయూలోని లా విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాయిన్ అయ్యారు.

2017లో గిరిజనుల ఆస్తి హక్కుల పరిరక్షణ మీద పీహెచ్డీ చేశారు గుమ్మడి అనురాధ. తండ్రి నేర్పిన విలువలే లక్ష్యంగా జీవితాన్ని ముందుకు సాగిస్తున్నారు. కాలేజీ రోజుల్లో విద్యార్థి సంఘాల్లో కూడా పనిచేశారు. గుమ్మడి నరసయ్య లాగే ఆయన కూతురు అనురాధ కూడా ఎలాంటి హంగూ, ఆర్భాటాల జోలికి వెళ్ళరు. అందుకే అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అక్కడ యువత, ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అందుకే ఫ్లెక్సీలు, బ్యానర్ల రూపంలో తమ ఇష్టాన్ని చెబుతున్నారు.

ఈసారి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ బాస్ దీన్నే పరిగణలోకి తీసుకొని వ్యూహం రచిస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ చాలా వీక్ గా ఉంది. ఈ జిల్లా నుంచి పెద్దపెద్ద వారు కూడా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు కేసీఆర్. బీఆర్ఎస్ లోకి భారీగా వలసలు వచ్చినప్పటికీ పార్టీ బలపడలేదు.

కొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి బడా నాయకులు టిఆర్ఎస్ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరడంతో నష్టమే జరిగింది. ఇటీవల టిఆర్ఎస్లోకి తెల్లం వెంకట్రావును చేర్చుకుంది హై కమాండ్…ఇంకా బలపడి ఖమ్మంలో బాగా వేయాలని మాస్టర్ ప్లాన్ లో ఉందట. ఇల్లందు విషయానికి వచ్చేసరికి గతంలో కాంగ్రెస్ తరపున హరిప్రియ గెలిచారు. ఆమె తాజాగా టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నప్పటికీ ఈసారి టికెట్ ఇచ్చే పరిస్థితులు లేవని తెలుస్తోంది.

దీంతో హరిప్రియ స్థానంలో మహిళను, ఓ కొత్త వ్యక్తిని బరిలోకి దింపాలని అధిష్టానం ఆలోచిస్తోందట. ఆ సమయంలోనే స్థానిక నాయకులు కొందరు గుమ్మడి అనురాధ పేరు సూచించడం, వయసురీత్యా గుమ్మడి నరసయ్యకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో కుదిరితే అనురాధాను టిఆర్ఎస్ తరఫున పోటీ చేయించాలని అనుకుంటున్నారట. 

ఇది కుదరకపోతే పొత్తులో భాగంగా సిపిఎంఎల్ తరఫున బరిలోకి దించాలని వ్యూహం. ఇలా ఓవైపు చర్చలు నడుస్తుండగానే మరోవైపు అనురాధ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ఏదేమైనా.. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అసలు విషయం వెలుగులోకి వస్తుంది. వేచి చూడాల్సిందే.