Telangana Election 2023 : తాతకు తగ్గ మనవడు ... అమెరికా నుండే కల్వకుంట్ల హిమాన్షు సరికొత్తగా ప్రచారం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ అమెరికాలో వున్న కేసీఆర్ మనవడు బిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా వినూత్న ప్రచారాన్ని చేపట్టాడు. దీంతో తాతకు తగ్గ మనవడు అంటూ బిఆర్ఎస్ అభిమానులు కొనియాడుతున్నారు.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. అధికార బిఆర్ఎస్ సహా ప్రధాన పార్టీలన్ని బయటకు గెలుపు తమదేనంటూ ధీమా ప్రదర్శిస్తున్నాయి. కానీ లోలోపల ప్రతి పార్టీ, ప్రతి నాయకుడు టెన్షన్ పడుతున్నాడనేది ప్రజలందరికీ తెలుసు. దీంతో గెలుపు కోసం కొత్త కొత్త అస్త్రాలను బయటకు తీస్తున్నాయి పార్టీలు. తమవారికి మద్దతుగా కొందరు తమవంతు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇలా తాత కేసీఆర్, తండ్రి కేటీఆర్ లు బిఆర్ఎస్ ను గెలిపించుకునేందుకు తాపత్రయపడుతుంటే చూసి ఊరికే వుండలేకపోయినట్లున్నాడు కల్వకుంట్ల హిమాన్షు. పార్టీ శ్రేణులకు బూస్టప్ ఇద్దామనుకున్నాడో లేక ప్రజలకు బిఆర్ఎస్ పాలన గురించి వివరించాలనుకున్నాడో ఏమో...అమెరికా నుండి తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాడు హిమాన్షు.
ఉన్నత చదువుల కోసం ఇటీవల అమెరికా వెళ్లాడు కేటీఆర్ తనయుడు హిమాన్షు. అయితే ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పర్వం కొనసాగుతుండటంతో తాత కేసీఆర్ పాలన ఎలా సాగిందో వివరిస్తూ సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభించాడు. ఇలా ఎక్స్ (ట్విట్టర్) వేదికన తెలంగాణ అభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం ఏమేం చేసిందో వివరిస్తూ ట్వీట్ చేసారు.
''ఒక దశాబ్ది కాలంలో శతాబ్ది అభివృద్ధి... ముఖ్యమంత్రి కేసీఆర్ సుపరిపాలకు ఈ స్టేట్ మెంట్ సరిగ్గా సరిపోతుంది. ఎంతో పారదర్శకతతో మరెంతో పట్టుదల, తపనతో రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించారు కేసీఆర్. బిఆర్ఎస్ పాలన వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో కొత్త విప్లవాన్ని సృష్టించింది... దీంతో రాష్ట్రంలో సమ్మిళిత వృద్ది సాధ్యమయ్యింది. సామాజిక సాధికారత, పర్యావరణ పరిరక్షణకు ఈ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. ఇక రాష్ట్రంలో ఐటీ అభివృద్ది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ స్థాయిలో ఐటీ అభివృద్ది చెందిదో అందరూ గమనిస్తూనే వున్నారు'' అని హిమాన్షు పేర్కొన్నారు.
Read More అది ఆషామాషీగా చెప్పలేదు.. కేసీఆర్ ను ఓడించి తీరతా.. ఈటల రాజేందర్
''మరోవైపు అనాదిగా తెలంగాణ ప్రజలను పట్టిపీడిస్తున్న సమస్యలు సైతం కేసీఆర్ పారదోలారు. ఇలా నల్గొండ జిల్లాలో ప్లోరోసిస్ సమస్య పోయింది... పాలమూరులో వలసలు ఆగిపోయాయి. వ్యవసాయానికి ఉచితంగానే నాణ్యమైన విద్యుత్ అందించడం ద్వారా రైతుల ఆత్మహత్యలు లేకుండా చేసారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందించే ఏర్పాటు చేసారు. కాళేశ్వరం వంటి అద్భుతమైన ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన, సామాజికంగా అణచివేతకు గురయిన వర్గాలకు అండగా నిలిచారు'' అంటూ తాత కేసీఆర్ ను హిమాన్షు కొనియాడాడు.
''హైదరాబాద్ లో మత ఘర్షణలకు తావులేకుండా చేసారు. రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలు అదుపులో వుంచారు. అలాగే గర్బిణులు, బాలింతల మరణాలను తగ్గించారు... నిరుపేదలకు నాణ్యమైరన వైద్యం అందిస్తున్నారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందుబాటులో వుండేలా చేసారు. ఇంకా ఎన్నో ఎన్నెన్నో చేసారు. కాబట్టి మళ్లీ కారే రావాలి... కేసీఆరే గెలవాలి'' అంటూ హిమాన్షు ట్వీట్ చేసాడు.