మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ చానెల్ వీడియో జర్నలిస్ట్ కొడుకు దీక్షిత్ ను గుర్తు తెలియని దుండగులు ఆదివారం నాడు కిడ్నాప్ చేశారు.

తండ్రితో కలిసి దసరా షాపింగ్ చేసి వచ్చిన బాలుడిని దుండగులు కిడ్నాప్ చేశారు.  ఆదివారం నాడు స్నేహితులతో కలిసి ఆడుకొంటున్న సమయంలో నిందితులు బాలుడిని కిడ్నాప్ చేశారు.  బాలుడి పేరు దీక్షిత్. అతని వయస్సు 9 ఏళ్లు.

ఆదివారం నాడు దసరాను  పురస్కరించుకొని షాపింగ్ చేసిన దీక్షిత్ సాయంత్రం ఇంటికి వచ్చాడు.తమ ఇంటి పక్కనే ఉన్న భువనచంద్ర, హర్షతో కలిసి ఆడుకొంటున్న సమయంలో  ఇద్దరు దుండగులు అతడిని కిడ్నాప్ చేశారు.

బైక్ పై వచ్చిన వక్తి పిలవడంతో దీక్షిత్ నవ్వుకొంటూ వెళ్లినట్టుగా స్నేహితులు చెప్పారు.ఆదివారం నాడు రాత్రి 9:40 గంటలకు కిడ్నాపర్లు దీక్షిత్ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి రూ. 45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 సోమవారం నాడు వరకు బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి బాలుడు ఆడుకొన్న ప్రదేశంతో పాటు పరిసరాలను పరిశీలించారు.బాలుడి ఆచూకీని కనిపెట్టేందుకు ఇద్దరు డీఎస్పీలు, 8 మంది సీఐలు, 15 మంది ఎస్ఐలు, 50 మంది సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు.

కిడ్నాపర్లు పలు ఫోన్ నెంబర్లను మార్చి ఫోన్లు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. బాలుడిని బైక్ పై తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ దృశ్యాల ఆదారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సోమవారం నాడు సాయంత్రం ఫోన్ చేస్తామని కిడ్నాపర్లు చెప్పారు. అయితే ఇంతవరకు ఫోన్ రాలేదని బాధిత కుటుంబసభ్యులు తెలిపారు.  తమ కొడుకును ఏమి చేయొద్దని బాధిత కుటుంబసభ్యులు కోరుతున్నారు.