TRS-BJP: బీజేపీ-టీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య పొలిటికల్ వార్ మ‌రింత‌గా ముదురుతోంది. కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు  2014 నుంచి విచక్షణారహితంగా పెంచిన సెస్‌లను తగ్గించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. దీంతో ఇంధన ధర 30 శాతం తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. 

Telangana: ఇప్ప‌టికే భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ), తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్‌) పార్టీల మ‌ధ్య పొలిటిక‌ల్ వార్ జ‌రుగుతోంది. త్వ‌రలో జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు, లోక్ సభ ఎన్నికల నేప‌థ్యంలో ఇరు పార్టీల నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు రాజ‌కీయంగా కాక రేపుతున్నాయి. మూడో సారి అధికారం ద‌క్కించుకోవాల‌ని టీఆర్ఎస్ చూస్తుండ‌గా, రాష్ట్రంలో అధికార పార్టీకి కళ్లెం వేసి.. ఎలాగైన సీఎం పీఠం ద‌క్కించుకోవాల‌ని బీజేపీ దూకుడుగా ముందుకు సాగుతోంది. అలాగే, కాంగ్రెస్ పార్టీ సైతం టీఆర్ఎస్‌, బీజేపీల‌పైచేయి సాధించేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఈ త్రిముఖ పోరులో అధికార పార్టీ బీజేపీని ఎక్కువ‌గా టార్గెట్ చేస్తోంది. దీని వెనుక గ‌ల కార‌ణాలు గ‌మ‌నిస్తే.. సీఎం కేసీఆర్ దేశ రాజ‌కీయాల వైపు అడుగులేస్తుండ‌టం ఒక‌టి కాగా, రెండోది రాష్ట్రంలో బీజేపీ దూకుడును అడ్డుక‌ట్ట వేయ‌డం మ‌రోక‌టి. 

అందుకే అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా కేంద్రంలోని ప్ర‌ధాని మోడీ బీజేపీ స‌ర్కారుపై టీఆర్ఎస్ ప‌దునైన విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. కేంద్రం తీరును త‌ప్పుప‌ట్ట‌డానికి ఉన్న ప్ర‌తి అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌డానికి చూస్తోంది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల ధాన్యం కొనుగోలులు గురించి పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు నిర్వ‌హించింది టీఆర్ఎస్. రాష్ట్రంలోనే కాకుండా ఏకంగా దేశ‌రాధాని ఢిల్లీలో గులాబీ బాస్ రైతుల స‌మ‌స్య‌లు, ధాన్యం కొనుగోలు విష‌యంలో కేంద్ర అనుస‌రిస్తున్న తీరుపై నిర‌స‌న‌కు దిగారు. రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్య‌క‌ర్త‌లు ఈ నిర‌స‌న దీక్ష‌లో పాల్గొన్నారు. ధాన్యం విష‌యంలో ప్ర‌జ‌ల‌ను కేంద్రంలోని బీజేపీ సర్కారు.. క‌మ‌ళం నేతలు త‌మ వ్యాఖ్య‌ల‌తో త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని మండిప‌డ్డారు. 

బీజేపీ-టీఆర్ఎస్ ల మ‌ధ్య పొలిటిక‌ల్ వార్ ను తారాస్థాయికి తీసుకెళ్లిన ధాన్యం కొనుగులో అంశం ముగిసింద‌నుకునే లోపే మ‌రో స‌రికొత్త వార్ కు తెర‌లేసింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య‌లో బీజేపీ-టీఆర్ఎస్ నేతల మ‌ధ్య మాట‌ల యుద్ధం మ‌ళ్లీ షురు అయింది. ప్ర‌ధాని మోడీ బుధ‌వారం నాడు దేశంలో మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు, ప్ర‌స్తుత ప‌రిస్థితుల గురించి వ‌ర్చువ‌ల్ గా స‌మావేశం నిర్వ‌హించారు. అయితే, ఈ స‌మావేశంలో చ‌మురు పై రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌న్నులు త‌గ్గించాల‌నీ, దీంతో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గుతాయంటూ వ్యాఖ్య‌నించారు. ఇప్పుడు ఇది రాజ‌కీయ దుమారం రేపుతోంది. క‌రోనా పై మీటింగ్ పెట్టి చ‌మురు ధ‌ర‌ల గురించి మాట్లాడ‌టం ఏంట‌ని ప్ర‌తిప‌క్ష నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. ఇక టీఆర్ఎస్ నేత‌లైతే కేంద్రంలోని బీజేపీ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. 

ఇదే విష‌యంపై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి సిగ్గుండాలి అంటూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. క‌రోనావైర‌స్ గురించి మీటింగ్ పెట్టి పెట్రోల్, డీజిల్ పై ప‌న్నులు త‌గ్గించాల‌ని రాష్ట్రాల‌కు చెప్ప‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. "ఇలా చెప్ప‌డానికి సిగ్గు ఎగ్గు ఉండాలి. ప్ర‌జ‌ల మీద ప్రేమ వుంటే నువ్వెందుకు ప‌న్నులు పెంచుతున్నవ్‌? ఇదెక్క‌డి నీతి? తెలంగాణ ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి పెట్రోల్ రేట్ల‌ను ఒక్క పైసా కూడా పెంచ‌లేదు. పెంచ‌ని మ‌మ్మ‌ల్ని ఎలా త‌గ్గించాలని అడుగుత‌వ్‌? రాజ‌కీయ ల‌బ్ది కోస‌మే ఈ స‌రికొత్త డ్రామా" అంటూ ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్‌.

మంత్రి కేటీఆర్ సైతం మోడీ స‌ర్కారు తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. "ఎన్‌పిఎ కేంద్ర ప్రభుత్వం కారణంగా ఇంధన ధరలు పెరిగాయి" అని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)ని నాన్-పెర్ఫార్మింగ్ అలయన్స్ (ఎన్‌పిఎ)గా అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు. అసలు తాము వ్యాట్ పెంచనేలేదని, కానీ, పేరు పెట్టి మరీ ఈ రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని కోరడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడే సహకార సమాఖ్యస్ఫూర్తి అంటే ఇదేనా? అంటూ ప్రధానిని ప్రశ్నించారు. 2014 నుంచి తెలంగాణ ప్రభుత్వం చమురుపై వ్యాట్ పెంచలేదని స్పష్టం చేశారు. సెస్‌ను ఎత్తేయండని కోరారు. తద్వార దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్‌ను రూ. 70కి, డీజిల్‌ను రూ. 60కి తాము అందించగలుగుతామని పేర్కొన్నారు. కాగా, తెలంగాణలో పెట్రోల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్) 35.2 శాతం ఉండగా, డీజిల్‌పై 27 శాతంగా ఉంది.