తెలంగాణకు వస్తా... వ్యవసాయ ప్రగతిని చూస్తా : మంత్రి సింగిరెడ్డితో ఎంఎస్ స్వామినాథన్ (వీడియో)
భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ ను తెలంగాణ వ్యవసాాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసారు.

చెన్నై : తెలంగాణలో జరుగుతున్న వ్యవసాయాభివృద్దిని చూడాలని వుందని హరితవిప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ తెలిపినట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో నివాసముంటున్న స్వామినాథన్ ను మంత్రి నిరంజన్ రెడ్డితో కూడిన బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా తెలంగాణలో వ్యవసాయ అనుకూల విధానాల గురించి హరిత విప్లవ పితామహుడికి వివరించినట్లు మంత్రి తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో వ్యవసాయం పండగలా మారిందని... అనేక విజయాలను అందుకున్నట్లు వ్యవసాయ మంత్రి ఎంస్ స్వామినాథన్ కు తెలిపారు. రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత కరెంట, సాగునీరు, పంటల కొనుగోలు, ప్రత్యామ్నాయ పంటల సాగు ఆవశ్యకత, రైతువేదికలు వంటి వాటిని స్వామినాథన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.
తెలంగాణ ప్రభుత్వం ఇక్కడి రైతులకు అందిస్తున్న రైతు బంధు, రైతు భీమా ఐక్యరాజ్యసమితి ప్రశంసలను అందుకున్నట్లు మంత్రి తెలిపారు. ఐక్యరాజ్యసమితి ఫుడ్ ఆండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మానవాళిని ప్రభావితం చేసే 20 బృహత్ పథకాల్లో వీటికి చోటు దక్కందని తెలిపామన్నారు. అయితే ఈ విషయాలన్నీ తనకు తెలుసని స్వామినాథన్ అన్నారని వ్యవసాయ మంత్రి వెల్లడించారు.
వీడియో
98 ఏళ్ల వయసులోనూ ఎంస్ స్వామినాథన్ జ్ఞాపకశక్తి అమోఘమని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావును పరిచయం చెయ్యగా గతంలోనే ఆయనను చూసానని స్వామినాథన్ తెలిపారన్నారు. తన ఆరోగ్యం కుదుటపడగానే తెలంగాణకు వచ్చి వ్యవసాయ విధానాలను పరిశీలిస్తానని స్వామినాథన్ తెలిపారట. ఈ వయసులోనూ స్వయంగా తెలంగాణకు వస్తానని చెప్పడమే గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నామని వ్యవసాయం మంత్రి పేర్కొన్నారు.
కోట్లాదిమంది భారత ప్రజల ఆకలిబాధను తీర్చిన మహనీయుడు, వ్యవసాయ సంస్కరణలు, సస్యవిప్లవ పితామహుడు స్వామినాథన్ ను కలవడంతో అదృష్టంగా భావిస్తున్నానని నిరంజన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ మంత్రిగా పనిచేయడం... ఈ హోదాలో ఎంఎస్ స్వామినాథన్ ను కలవడంతో తన జన్మ సార్ధకత లభించిందని భావిస్తున్నానని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.